SS Rajamouli: 'హ్యాపీ బర్త్ డే' మూవీ ట్రైలర్ లాంఛ్ లో పాల్గొన్న ఎస్ఎస్ రాజమౌళి.. చిత్రయూనిట్ పై ప్రశంసలు!
SS Rajamouli: టాలీవుడ్ లో ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాజాగా నటించిన సినిమా 'హ్యాపీ బర్త్ డే'. ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య, నరేష్ అగస్త్య, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కాగా, ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. లావణ్య త్రిపాఠి ఈ చిత్రం ద్వారా తన కెరీర్‌లో మొదటిసారి నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో కథ మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది. కాగా, ఈ సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birth Day Movie) సినిమాను తొలుత జులై 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే అంటే జులై 8న రిలీజ్ చేయనున్నట్లు శనివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ "మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ. హ్యాపీ బర్త్ డే కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్ గా ఉంది. నిర్మాత చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా పెద్ద అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రికి మంచి సక్సెస్ ఇవ్వాలి అని అన్నారు.
ఇక, దర్శకుడు రితేష్ గురించి మాట్లాడుతూ.. తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్ లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే నవ్వొచ్చింది. లావణ్య (Lavanya Tripathi) క్యారెక్టర్ బాగుంది. హీరోయన్స్ కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని కొనియాడారు. కాగా, ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. కెమెరా: సురేష్ సారంగం, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి.