1. మంగమ్మ గారి మనవడు (Mangamma Gari Manavadu)
ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.
భానుమతి (మంగమ్మ) మనవడిగా బాలకృష్ణ... మంగమ్మ కూతురు అనిత, అల్లుడు గోకినేని రామారావు, మనవరాలుగా సుహాసిని నటించారు. ఈ రెండు కుటుంబాలకు సయోధ్య లేదు. కానీ మనవడు, మనవరాలికి ఒకరంటే ఒకరికి ఇష్టం. పొరుగు గ్రామంలో మోతుబరి ఏలేశ్వరంరంగాకు మంగమ్మ అంటే పడదు. ఐతే రెండు ఊర్లకు ప్రతీ సంవత్సరం ఎడ్ల పందాలు జరుగుతుంటాయి. గోకిన రామారావు తాగిన మత్తులో తన ఎద్దును లొంగదీసినవాడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని పందెం వేస్తాడు. మొసం చేసి పందెంలో ఎద్దును ఓడిస్తారు. పందెంలో ఓదిపోయిన గోకిన రామారావు ఆత్మ హత్య చేసుకుంటాడు. పెళ్ళి ఏర్పాటులో ఉన్న బాలకృష్ణ పై పొరుగూరి వ్యక్తులు దాడి చేస్తారు. బాలకృష్ణ ఆచూకి దొరకక మరణించాడనుకుంటారు. కొంతకాలానికి మిలటరీ దుస్తులతో బాలకృష్ణ వేరే అమ్మాయితో తిరిగి వస్తాడు. ఆ అమ్మాయి ఎవరు, బాలకృష్ణ ఎలా బ్రతికాడనేదే కథ.
2. నారీ నారీ నడుమ మురారి (Naari Naari Naduma Murari)
ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990 లో విడుదలైంది ఈ కుటుంబ కథా చిత్రం. ఆర్థికంగా విజయవంతమయిన ఈ సినిమాలో బాలకృష్ణ, శోభన, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. "నక్కబొక్కలపాడు" గ్రామంలో శేషారత్నం (శారద) బాగా తలపొగరున్న ధనిక యువతి. ఆమె భర్త జానకిరామయ్య (సత్యనారాయణ) భార్య మాటకు లోబడి నడుచుకొంటుంటాడు. వారికిద్దరు ఆడపిల్లలు - శోభ (శోభన), నీరు (నిరోష). జానకిరామయ్య తల్లిగా అంజలీదేవి నటించింది. జానకిరామయ్య మేనల్లుడు వెంకటేశ్వరరావు (నందమూరి బాలకృష్ణ) ఈ సినిమా హీరో. తన కూతుళ్ళలో ఒకరిని మేనల్లుడికిచ్చి పెళ్ళి చేయాలని జానకిరామయ్య కోరిక. భర్తవైపు బంధువులంటే ఇష్టంలేని శేషారత్నం అందుకు అస్సలు ఒప్పుకోదు. మేనమామ కోరిక ప్రకారం అతని కూతుళ్ళలో ఒకరిని ఆకర్షించాలని వెంకటేశ్వరరావు నక్కబొక్కలపాడుకు వస్తాడు. అయితే ఇద్దరూ బావను ప్రేమించడం మొదలుపెడతారు. తరువాత జరిగే పరిణామాలే ఈ సినిమా కథాంశం.
3. ఆదిత్య 369 (Aditya 369)
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. తరాల తారతమ్యం లేకుండా 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది. శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రమిది. వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి… సినిమా నెగెటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసిన మొదట్టమొదటి సినిమా ‘ఆదిత్య 369’.
4. భైరవ ద్వీపం (Bhairava Dweepam)
1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం 'భైరవ ద్వీపం'. బాలకృష్ణ, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి రావి కొండలరావు కథ, మాటలు అందించారు. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రం 1994 లో మూడవ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ప్రేక్షకులకి ఈ మూవీ కొత్త అనుభూతిని అందించి ప్రశంసలు అందుకుంది. 9 విభాగాల్లో ఈ మూవీ `నంది` అవార్డు పురస్కారాలను కూడా అందుకుంది. బాలకృష్ణ కి జోడీగా రోజా నటించగా.. బాలయ్యకి తల్లిగా కేఆర్ విజయ నటించారు. విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. రంభ, రవళి స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు.
5. సమరసింహారెడ్డి (Samara Simha Reddy)
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో సమరసింహా రెడ్డి సినిమా ఒకటి. అప్పట్లో ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది. రికార్డ్స్ బ్రేక్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను తీసుకు వచ్చింది. సిమ్రాన్, అంజలా ఝవేరి హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ అందించగా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
సమరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు.
6. నరసింహనాయుడు (Narasimha Naidu)
బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా ఆషా సైనీ కథానాయికలుగా నటించారు. సమర సింహా రెడ్డి తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా సమర సింహారెడ్డి లాగే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతంతో పాటు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. నరసింహనాయుడు చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో బాలయ్య చెప్పే.. కత్తులతో కాదురా..కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిలిచిపోయింది.
7. సింహా (Simha)
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన తొలి సినిమా ఇది. మరోవైపు బాలయ్య, నయనతార, చక్రి కాంబినేషన్‌లో కూడా ఇదే తొలి సినిమా. నలుగురికి మంచి చేయటానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. 2004.. లక్ష్మీనరసింహా సినిమా విడుదలైంది.. సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వరసగా ఆరేళ్ల పాటు బాలకృష్ణకు ఒక్క హిట్ కూడా రాలేదు. కనీసం యావరేజ్ కూడా లేదు. మధ్యలో ‘మహారథి’, ‘వీరభద్ర’, ‘ఒక్క మగాడు’, లాంటి డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వరస పరాజయాలతో బాలకృష్ణ పని అయిపోయిందిక అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వచ్చిందో సినిమా.. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ఏంటో.. ఆయనకు సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చిందో సినిమా.. అదే సింహా. సింహాతో బాలయ్య చాలా ఏళ్ల తర్వాత సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య చెప్పిన ‘చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు మాడిపోతావు అంటూ చెప్పిన డైలాగ్.. థియేటర్స్‌లో మారుమ్రోగింది. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఈ సినిమా డైలాగులను ఆస్వాదించారు.
8. శ్రీరామరాజ్యం (Sree Rama Rajyam)
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా నయనతార నటించగా లక్ష్మణుడిగా శ్రీకాంత్, వాల్మీకి గా మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు. రోజా, సాయి కుమార్, జయసుధ, బ్రహ్మానందం, ధారాసింగ్, కేఆర్ విజయ, మురళీమోహన్, సమీర్, నాగినీడు, సుధ, హేమ, ఝాన్సీ, శివపార్వతి, రాళ్ళపల్లి తదితరులు నటించారు. 32 కోట్ల తో నిర్మించిన ఈ చిత్రం 72 కోట్ల వసూళ్ళని సాధించింది. అటు నిర్మాతకు ఇటు బయ్యర్లకు కూడా లాభాలు తెచ్చిపెట్టింది శ్రీరామరాజ్యం. ఇక ఇళయరాజా అందించిన పాటలు ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచాయి. బాపు కమనీయ దృశ్య కావ్యం లా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. బాలయ్యకు శ్రీరాముడి పాత్ర కొత్త కాదు కానీ పూర్తిస్థాయిలో శ్రీరాముడిగా నటించిన చిత్రం మాత్రం ఇదే. నయనతార ఆఖరి చిత్రంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే ఆ పెళ్లి పెటాకులు కావడంతో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
9. లెజెండ్ (Lezend)
బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో సింహా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. అప్పట్లో లెజెండ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఏకంగా 1000 రోజుల పాటు థియేటర్స్ లో దిగ్విజయంగా ఆడింది ఈ చిత్రం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు (Jagapathi Babu) విలన్ గా నటించాడు. ఆయన కెరీర్ ను మార్చేసిన సినిమా ఇది. 2014 ఎన్నికలకు ముందు వచ్చిన ఈ చిత్రంలో పొలిటికల్ పంచులు కూడా బాగానే ఉన్నాయి. 'సింహా' సూపర్ హిట్ కావడంతో ఆ నమ్మకంతోనే బాలయ్య సినిమాల్లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేసారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో సంచలనం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు దీనికి వచ్చిన నంది అవార్డులపై కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. బాలయ్య కెరీర్‌లో మొదటి 40 కోట్ల షేర్ అందుకున్న సినిమా ఇది.
10. అఖండ (Akhanda)
చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగ రాయాలన్నా బాలకృష్ణనే. తన సినీ కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలందుకున్న ఆయన రీసెంట్‌గా బోయపాటితో కలిసి 'అఖండ' విజయం సాధించారు. కరోనా కష్టకాలంలో కూడా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నటసింహం గర్జనతో థియేటర్లు మార్మోగిపోయాయి. అంతేకాదు ఒకప్పుడు జనం చెప్పుకునే కన్నుల పండగల్లాంటి 50 రోజులు, 100 రోజుల వేడుకలను మరోసారి జనం ముందుకు తీసుకొచ్చింది ఈ 'అఖండ'.
బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబోలో వచ్చి హాట్రిక్ హిట్ సాధించింది 'అఖండ' సినిమా. ఇందులో బాలయ్య బాబు నటన మాస్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం చూపించగా.. తమన్ బాణీలు గూస్ బంప్స్ తెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల పంట పండించిన ఈ సినిమా OTTలో విడుదలై కూడా సత్తా చాటింది.
Follow Us