టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ (Bandla Ganesh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతగా ఉన్న బండ్ల గణేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు.
2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ (Bandla Ganesh).. ఇప్పుడు ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో 7'0 క్లాక్ బ్లేడ్ ఇష్యూతో చర్చల్లో నిలిచారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే 7'0 క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పి అలజడి సృష్టించారు.
కాగా, బండ్ల గణేష్ (Bandla Ganesh Twitter Post) ట్విట్టర్ వేదికగా.. ‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనుల వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరి.. దీని వెనక ఏదైనా మతలబు ఉందా.. లేదంటే నిజంగానే తప్పుకుంటున్నాడా అన్న చర్చ ఆయన అభిమానుల్లో నడుస్తోంది. ఇదిలా ఉంటే.. స్వతహాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమాని అయిన బండ్ల గణేష్.. జనసేనలో చేరే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో అనేది భవిష్యత్తులో చూడాలి..!
బండ్ల గణేష్.. ఒక నటుడిగా, ఓ స్టార్ ప్రొడ్యూసర్‌గా.. అన్నింటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు బండ్ల గణేష్. చాలా సినిమాల్లోనూ యాక్టర్‌గాను నటించారు. ఇటీవలే 'బ్లేడ్ బాబ్జీ' పేరుతో వచ్చిన సినిమాలో లీడ్ రోల్‌లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.
Follow Us