పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో (RRR) హాలీవుడ్ స్థాయిలోకి తన ఇమేజ్ పెంచుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. 'బాహుబలి' (Bahubali) సిరీస్, 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడాయన. ఈ రెండు సినిమాలు ఒకానొక సమయంలో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలతో పోటీ పడ్డాయంటే జక్కన్న మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, భారత సినీ పరిశ్రమలో దేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, రాజమౌళి ప్రస్తుతం హాలీవుడ్ ను టార్గెట్ చేసే దిశగా ప్లాన్స్ వేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ దర్శక ధీరుడు త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఇటీవల టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మీడియా ఇంటరాక్షన్ లో జక్కన్న మాట్లాడుతూ.. మహేశ్ తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి టాప్ స్టూడియోలతో కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA)కు సంతకం చేశాడట జక్కన్న. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ కోసమే రాజమౌళితో సీఏఏ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజమౌళి భవిష్యత్తులో 'మహాభారతం' ప్రాజెక్ట్ ని సుమారు వెయ్యి కోట్లకిపైగా బడ్జెట్ తో భారీతారాగణంతో ఐదు సీక్వెల్స్ గా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అతిపెద్ద మల్టీ స్టారర్ చిత్రంగా ఆవిష్కరించడానికి సిద్దమవుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసమే హాలీవుడ్ (Hollywood) ప్రొడక్షన్ ఏజెన్సీ రాజమౌళితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. సీఏఏ (CAA) అనేది లాస్ ఏంజెల్స్ కేంద్రంగా నడిచే క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ. సినిమాల ఎండార్స్మెంట్- బ్రాండింగ్- మార్కెటింగ్ తోపాటు అవకాశాలను సృష్టిస్తూ, అనేక మంది హాలీవుడ్ డైరెక్టర్లు, నటీనటులకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి సైతం వారితో డీల్ కుదుర్చుకోవడంతో.. మన దర్శకుడు కూడా ఈ లెజెండ్స్ జాబితాలోకి చేరాడని అంటున్నారు.
Follow Us