టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓరి దేవుడా' (Ori Devuda). సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ఓ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగు లో ‘ఓరి దేవుడా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఇప్పటికే 'ఓరి దేవుడా' (Ori Devuda) సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ స్టేజ్ పై చరణ్ (Ram Charan) మాట్లాడుతూ.. "చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మీరంతా రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి సినిమాను ఆదరించే మీ గుణాన్ని మరోసారి చాటుకుంటున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. అయితే, రామ్ చరణ్ హాజరు కావడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఇక, ఈవెంట్ లో విశ్వక్ సేన్ ని ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియని వాళ్లు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్‌తో ఫలక్‌నుమా నుంచి రాజమండ్రి వరకు.. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో విశ్వక్‌సేన్‌కు (Vishwak Sen) అభిమానులున్నారు. ఫలక్‌నుమాదాస్, హిట్ సినిమాలు చూశాను. విశ్వక్‌సేన్‌కు యూత్ ఫ్యాన్స్ ఉన్నారు. విశ్వక్ సేన్ కు సినిమాల్లో హీరో కన్నా ఆయన బయట పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని’ అని అన్నారు.
"ఇచ్చిన మాటపై నిలబడే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక పేరు నాకు ఉంది. విష్వక్ కూడా అంతే అనే విషయం నాకు తెలిసింది. ఒక రజనీకాంత్.. చిరంజీవి (Chiranjeevi).. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూపర్ స్టార్ లు అనిపించుకోవడానికి వారి వ్యక్తిత్వమే కారణం. అలాంటి వ్యక్తిత్వం విశ్వక్ సేన్ కి నిండుగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ఇక విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. నీ సినిమా షూటింగ్ పెట్టుకొని కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు. రామ్ చరణ్ అన్నలా ఉండడం మాములు విషయం కాదు. చిరంజీవి గారి కొడుకుగా పరిచయం అవుతున్నారంటే, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఈ రోజు వాటిని అందుకోవడమే కాకుండా, అయన నటనతో దేశాలు దాటి మరీ వెళ్ళిపోయాడు. చరణ్ అన్న చుట్టూ ఉన్నవారు.. ఆయన క్రమశిక్షణ గురించే మాట్లాడతారు. నేను అయన నుంచి ఏమన్నా నేర్చుకునేది ఉందంటే అది అయన క్రమశిక్షణే. ఎందుకంటే నాకు లేనిదే అది” అంటూ పేర్కొన్నారు.
Follow Us