SuperStar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ చనిపోవడానికి కారణం అదే.. వెల్లడించిన డాక్టర్లు !

సూపర్‌స్టార్ కృష్ణ (SuperStar Krishna) మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు

భారతదేశం గర్వించే తెలుగు చలనచిత్ర నటుడు కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ (SuperStar Krishna) మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు యావత్తు చిత్ర పరిశ్రమ, ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. 

సూపర్‌స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్‌ చేశాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన హెల్త్ కండీషన్ విషమంగా ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరం ఏర్పడటంతో అది కూడా చేశాం. కృష్ణకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశాం’ అని డాక్టర్ గురు తెలిపారు. 

మెడికల్ ఎథిక్స్ పాటించాం
‘కృష్ణ ఆరోగ్య పరిస్థితి సోమవారం సాయంత్రం విషమించింది. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని, వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచారు. కృష్ణ విషయంలో మెడికల్ ఎథిక్స్ పాటించాం. ఆయన ఫ్యామిలీకి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం. కృష్ణ గొప్పమనిషి. ఆయన భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబానికి అప్పగించాం’ అని డాక్టర్‌ గురు పేర్కొన్నారు. 

Read More: టికెట్‌కు రూపాయి చొప్పున రైతులకు ఇస్తా.. ‘లాఠీ’ (Laththi) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్ (Vishal) వ్యాఖ్యలు

You May Also Like These