టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పుట్టినరోజు.. ఫ్యాన్స్ సందడి!

Published on May 20, 2022 03:11 PM IST

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు నేడు. తాజాగా ఎన్టీఆర్ 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో ఆయన అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతాకాదు. సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ బర్త్ డే సంద‌ర్భంగా, ఫ్యాన్స్ చేసే ట్వీట్లు ఫుల్ ట్రెండింగ్‌‌లో ఉన్నాయి. అలాగే, సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ (NTR) నామజపంతో ఊగిపోతోంది.

ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులకు, ఇది పండుగ రోజులా మారింది. కాగా, తమ అభిమాన హీరో ఎన్టీఆర్ (NTR) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్యాన్స్ రంగం సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆయ‌న‌ అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హడావుడి మొద‌లైంది.

ఎన్టీఆర్ ఇంటికి అభిమానులు భారీగా తరలిరావడంతో, ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అలాగే ఆయన ఇంటి ముందు కేక్ కట్ చేసే సమయంలో, అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ కూడా చోటుచేసుకుంది. ఫ్యాన్స్ చేస్తున్న‌ అల్లరి శృతి మించడంతో, పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కూడా అభిమానుల అల్లరి ఎక్కువ కావడంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

ఇక అర్థరాత్రి కూడా కొందరు అభిమానులు తారక్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో భారీగా బాణాసంచా కాలుస్తూ హడావుడి చేశారు. దీంతో ఆ ఏరియా అంతా సందడిగా మారింది. చాలామంది అభిమానులు ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పడానికి, గురువారం అర్థరాత్రే ఆయన ఇంటికి చేరుకున్నారు. 

 ఆ సమయంలో ఎన్టీఆర్ (NTR) ఇంట్లో లేకపోవడంతో, ఆయన రాకకోసం రోడ్డుపైనే పడిగాపులు కాశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే వాహనదారులకు కూడా తీవ్ర‌ ఇబ్బంది ఎదురైంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను కంట్రోల్ చేశారు.  అయినా వారు కదలకపోవడంతో, నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు కదలకపోవడంతో,  పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఫ్యాన్స్‌ను చెదరగొట్టారు.