టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తర్వాతి సినిమాపై కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ‘జెర్సీ’ చిత్రం ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ భారీ సినిమాను రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్సీ 16గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ ఆగిపోయిందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై రామ్ చరణ్ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
గౌతమ్ తిన్ననూరి తీయాల్సిన ఆర్సీ 16 మూవీ ఆగిపోయిందని రామ్ చరణ్ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ ప్రాజెక్టును నిలిపేసినట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ‘మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరిల ప్రాజెక్టు ఆగిపోయింది. అతి త్వరలోనే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం’ అని ట్వీట్ చేసింది. అయితే.. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందనే విషయంపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
నెక్స్ట్ ఎవరితో చేస్తారో?
కొన్ని కారణాల వల్ల చరణ్–గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఆగిపోయిందని ఈమధ్య గాసిప్స్ వచ్చాయి. చరణ్ వేరొక దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే తాను నటించబోయే 16వ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తారని కథనాలు వచ్చాయి. ఇంతలోనే ఆయన టీమ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆగిపోయిందని స్పష్టం చేసింది. మరి, చరణ్ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన నుంచి మెగా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
శరవేగంగా శంకర్ మూవీ షూటింగ్
రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ తనదైన శైలిలో సందేశాన్ని ఇస్తూనే భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్నారు.
Follow Us