ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కి మరోసారి గోవా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ ఏడాది నవంబర్ 20వ తేది నుంచి 28వ తేది వరకు గోవాలో జరగనున్నాయి. ప్రదర్శన కోసం 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. అయితే.. టాలీవుడ్ నుంచి కనీసం ఒక్క నాన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ప్రదర్శనకి ఎంపిక కాకపోవడం గమనార్హం.
కాగా, ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్ లో తెలుగు నుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR), బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో వచ్చిన 'అఖండ' (Akhanda) సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.
ఈ సినిమాలతో పాటు ఈ విభాగంలో తెలుగు నుంచి ఎంపికైన వాటిలో కండ్రేగుల ప్రవీణ్ దర్శకత్వంలో వచ్చిన 'సినిమా బండి' (Cinema Bandi), విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఖుధిరాంబోస్' సినిమాలు ఉన్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన 'ఖుదీరామ్ బోస్' జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ సినిమా తెలుగులో ఎంపిక కాలేదు. కానీ.. హిందీ వెర్షన్ నుంచి సెలెక్ట్ అయ్యింది.
ఇక, నాన్ ఫీచర్ విభాగంలో ఠాంగ్, అథర్ రే-ఆర్ట్ ఆఫ్ సత్యజిత్రే, క్లింటన్, ఫాతిమా తదితర సినిమాలు ఉన్నాయి. ఓవరాల్‌గా హిందీ నుంచి 10 సినిమాలు, తెలుగు, తమిళ్ నుంచి నాలుగేసి సినిమాలు, బెంగాలీ నుంచి రెండు, కన్నడ, మలయాళం నుంచి మూడేసి సినిమాలు, మరాఠీ నుంచి ఐదు సినిమాలు ఎంపికయ్యాయి.
మన దేశంలో ప్రతి యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) అంటూ మన దేశం తరుపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించడం గత 50 ళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది.
Follow Us