దర్శకధీరుడు రాజమౌళి (rajamouli ss) తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) సిరీస్ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. జక్కన్న రూపొందించిన తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘బాహుబలి’తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి, శివగామి దేవి పాత్రలు అశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా రాజమాత శివగామి దేవి క్యారెక్టర్‌ను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. ఈ రోల్‌లో సీనియర్ నటి రమ్యకృష్ణ.. ఒకవైపు రాజమాతగా గాంభీర్యం, మరోవైపు తల్లిగా లాలిత్యంతో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. ఈ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవర్నీ ఊహించలేనంతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు.
శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసినా అంతగా గుర్తింపు వచ్చేది కాదని రాజమౌళితో సహా చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ రోల్ కోసం చాలా మంది నటుల్ని జక్కన్న సంప్రదించారు. అందులో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) కూడా ఉన్నారు. తొలుత ఈ క్యారెక్టర్ కోసం లక్ష్మి దగ్గరకు రాజమౌళి వెళ్లారట. అయితే ప్రభాస్‌కు తల్లిగా తాను చేయలేనంటూ ఆమె ఈ ఆఫర్‌ను వదులుకున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో లక్ష్మియే స్వయంగా చెప్పడం గమనార్హం.
తాజాగా మరోమారు శివగామి దేవి పాత్ర గురించి మంచు లక్ష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె.. ‘బాహుబలి’లో శివగామి పాత్ర చేయనందుకు తానేమీ బాధపడట్లేదన్నారు. ఆ క్యారెక్టర్‌కు తాను కరెక్ట్ కాదన్నారు. ఒకే తరహా రోల్స్‌లో నటించాలని తాను అనుకోవడం లేదన్నారు.
‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్ (Prabhas)కు తల్లిగా చేయాలని అనిపించలేదు. మన చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక పాత్ర పోషించిన తర్వాత మనం అందులోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక.. నిజానికి చాలా గర్వపడ్డా. హమ్మయ్యా.. నేను ఈ సినిమా చేయలేదు అనుకున్నా. అది ఓ స్పెషల్ మూవీ కావొచ్చు. కానీ నేను ఆ పాత్రకు కరెక్ట్ కాదని అనిపించింది. నా లైఫ్, కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నా’ అని మంచు లక్ష్మి ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలాగే తన కెరీర్‌లో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో చేసిన ఐరేంద్రి పాత్ర లాంటిది మరొకటి రాలేదన్నారు. అలాంటి రోల్ ఇక మీదట కూడా రాదని పేర్కొన్నారు.
Read more: బాహుబలి–3 (Baahubali 3)పై ముందే హింట్ ఇచ్చిన రాజమౌళి (SS Rajamouli)!
Follow Us