అభిమానులతో ముచ్చట.. ఆ మజానే వేరు : రామ్ చరణ్ (Ram Charan)

Published on May 10, 2022 03:22 PM IST

రామ్ చరణ్.. RRR అందించిన విజయంతో ప్రస్తుతం ఈ మెగా పవర్ స్టార్ ఆనందంలో తేలియాడుతున్నారు.  ఆయన తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య చిత్రం పెద్దగా సక్సెస్ కాలేనప్పటికీ, ఉత్సాహంగా తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నారు. ఇటీవలే చెర్రీ తన సతీమణి ఉపాసనతో కలిసి కారులో ప్రయాణిస్తూ.. అనుకోకుండా తన అభిమానుల కంటికి చిక్కారు. కార్ ఆపి, వారితో కాస్త ముచ్చటించారు. 

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ హోదాలో ప్రస్తుతం సేవలందిస్తున్నారు. అలాగే  బి పాజిటివ్ మ్యాగజైన్‌కి ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.  రామ్ చరణ్ (Ram Charan) -  ఉపాసన జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, జీవితాన్ని పూలపాన్పులా మార్చుకున్న ఆలుమగలుగా వీరు పలుమార్లు కితాబునందుకున్నారు. రామ్ చరణ్‌కు చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసన.. తర్వాత ఆయన అర్థాంగిగా మారడం విశేషం. 

రామ్ చరణ్ (Ram Charan) కూడా సినిమా నటుడిగానే కాకుండా, ఓ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడిగా, వ్యాపారవేత్తగా కూడా తనదైన శైలిలో రాణిస్తున్నారు. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కూడా ఆయన సుపరిచితుడు. తన కెరీర్‌లో రెండు నంది అవార్డులతో పాటు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న చెర్రీ.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.