తెలుగు నాట ‘కాంతార’ (Kantara) మూవీ సంచనాలు సృష్టిస్తోంది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో శనివారం విడుదలైన చిత్రం.. తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ‘కాంతార’ తెలుగు వెర్షన్ రిలీజైన మొదటిరోజే రూ.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ డే వసూళ్ల విషయంలో మిగతా అన్ని భాషల కంటే తెలుగు వెర్షన్‌కు వచ్చిన వసూళ్లు ఎక్కువని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
తొలి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. కన్నడ నాట కంటే తెలుగులోనే ‘కాంతార’ మంచి వసూళ్లను నమోదు చేయడం విశేషం. కన్నడలో విడుదలైన మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రెండున్నర కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. కానీ అదే తెలుగులో దాదాపుగా రెట్టింపు వసూళ్లతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక, హిందీ వెర్షన్ తొలి రోజు రూ.1.30 కోట్ల నెట్ వసూలు చేసింది. గ్రాస్‌గా చూసుకుంటే ఆ సంఖ్య.. రూ.1.60 కోట్లుగా ఉండొచ్చని అంటున్నారు.
థియేటర్లకు రప్పిస్తున్న మౌత్ పబ్లిసిటీ
కన్నడలో మంచి టాక్ రావడంతో ‘కాంతార’కు తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. అయితే ఇక్కడ అంతగా పబ్లిసిటీ చేయలేదు. అదే విధంగా మేకర్స్ నిర్వహించిన ఒకట్రెండు ఇంటర్వ్యూల్లోనూ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishan Shetty) ఎక్కువగా మలయాళంలో మాట్లాడారు. అది ఎంతమందికి అర్థమైందనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ‘కాంతార’కు తెలుగులో ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కానీ సినిమా అదిరిపోయిందని.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్లో ఉందని సూపర్ పాజిటివ్ టాక్ రావడం ‘కాంతార’ తెలుగు వెర్షన్‌కు కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘కాంతార’ చిత్రాన్ని తప్పక చూడాల్సిందేనంటూ సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు పాజిటివ్ పోస్టులు పెడుతుండటం విశేషం. అలాగే సినిమాను చూసిన వారు కూడా బాగుందంటూ మౌత్ పబ్లిసిటీ చేస్తుండటం గమనార్హం. అందుకే పెద్దగా పబ్లిసిటీ హంగామా లేకున్నా ‘కాంతార’ తెలుగు, హిందీ వెర్షన్లకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగితే దీపావళి వరకు ఈ మూవీ మరిన్ని రికార్డులు సాధించడం సులువుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ‘కాంతార’ తెలుగు వెర్షన్ పది కోట్ల మార్కును చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇక, ‘కాంతార’ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కోస్టల్ కర్ణాటకలో కనిపించే కాంబ్లా, భూతకోల సంప్రదాయాల ఆధారంగా యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి రూపొందించారు. ఇందులో రిషబ్ సరసన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు ఇది రెండో సినిమా కావడం విశేషం. అలాగే కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తుమినాడ్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ‘కాంతార’ మలయాళ డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 20న కేరళలో రిలీజ్ కానుంది.
Follow Us