షూటింగ్ స్పాట్‌లో రాజా రవీంద్రతో .. బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ (Syed Sohel Ryan) ముచ్చట్లు

Published on Apr 24, 2022 12:12 AM IST

ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ యమా బిజీగా మారాడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సొహైల్ రియాన్ (Syed Sohel Ryan). ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా ఓ వైవిధ్యమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. "ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు"అనే కొత్త సినిమాకి సైన్ చేశాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి (S V Krishna Reddy) దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇదే సినిమాలో ఒక డిఫరెంట్ పాత్ర పోషించనున్నారు. అనన్య హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది.  ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై ఈ చిత్రం నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. కోనేరు కల్పన ప్రొడ్యూసరుగా వ్యవహరిస్తున్నారు.

"ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు" చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, ఖుష్భు, ఆలీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ మొదలైనవారు నటిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సం ఏప్రిల్ 18 తేదిన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది.. పూజా కార్యక్రమాల అనంతరం నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్,  డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, ఎస్వీ కృష్ణారెడ్డితో ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన  ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అలాగే సొహైల్ నటిస్తున్న మరో పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. మోక్ష ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ “లక్కీ లక్ష్మణ్”. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు  ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.