సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'యశోద' (Yashoda). పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి ప్రేక్షకాదరణ పొందింది.
సరోగసి నేపథ్యంలో హరి-హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్ సహా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించి సామ్ కెరీర్ లో భారీ హిట్ గా నిలవగా ఈ చిత్రంపై ఇప్పుడు కేసు నమోదు కావడం షాకింగ్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంలో “ఈవా ఐవిఎఫ్ హాస్పిటల్స్” (EVA IVF Hospitals) పేరిట ఓ సరోగసి కేంద్రం చూపించి అందులో జరిగే అక్రమాలు అంటూ కొన్ని షాకింగ్ విజువల్స్ అయితే ఉంటాయి. దీంతో నిజ జీవితంలోనూ “ఈవా” పేరిట ఉన్న తమ హాస్పిటల్ అభ్యంతరకరంగా ఉందని ఈ చిత్రం వల్ల బయట తమ గౌరవం పోతుంది అని యాజమాన్యం హైదరాబాద్ కోర్టుని ఆశ్రయించారు.
‘యశోద’ (Yashoda) సినిమా కారణంగా తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఇవ-ఐవీఎఫ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు అన్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, అలాగే న్యాయ పోరాటంపై నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. నిర్దిష్టమైన ఇతివృత్తంతో సినిమా తీస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఒక పరిశోధనాత్మక కోణం నుంచి సరోగసీ స్కామ్‌ను వెలికితీసే ప్రయత్నంలో తమ సంస్థ పేరును వాడుకోవడమే ఆ చిత్ర నిర్మాత, దర్శకులు చేసిన తప్పిదమన్నారు.
దీంతో ‘యశోద’ (Yashoda) సినిమా ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19 వరకు యశోదను ఓటీటీలో విడుదల చేయొద్దని మేకర్స్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో ఆలస్యంగా విడుదల కానుంది.
Follow Us