దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ (SuperStar Krishna) మృతితో ఆయన ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మన అల్లూరి, మన జేమ్స్ బాండ్ కృష్ణ గారి మరణం తెలుగు వారికి తీరనిలోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇది మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు.
సూపర్‌స్టార్ చనిపోయినందుకు ఎవరూ బాధపడొద్దని ఆర్జీవీ (Ram Gopal Varma) అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయనిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వాళ్లిద్దరూ కలసి అక్కడ సంతోషంగా మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ‘మోసగాళ్లకు మోసగాడు’ మూవీలోని వారిద్దరి పాటను రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్‌కు జత చేశారు.
ఇకపోతే, సూపర్‌స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. ‘కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ చేశాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన హెల్త్ కండీషన్ విషమంగా ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం ఏర్పడటంతో అది కూడా చేశాం. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని, వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం’ అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.
Follow Us