దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. విడుదలై దాదాపుగా ఎనిమిది నెలలు కావొస్తున్నా ఏదో ఒక విషయంలో ఈ మూవీ పేరు వినిపిస్తూనే ఉంది. ఇండియాలో కలెక్షన్ల దుమ్ముదులిపిన జక్కన్న చిత్రం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల జపాన్‌లోనూ రిలీజై.. దాదాపుగా రూ.20 కోట్ల వరకు వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది.
ఇక హాలీవుడ్ ఆడియెన్స్ అయితే రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, తారక్–చరణ్‌ల నటనా పటిమకు ఫిదా అవుతున్నారు. దీంతో అక్కడి ప్రతిష్టాత్మక అవార్డులన్నీ ‘ఆర్ఆర్ఆర్’ ముందు సాగిలపడుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను వరించింది.
తాజాగా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ స్పాట్‌లైట్ విన్నర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలిచింది. నటులు, సాంకేతిక నిపుణులందరికీ అ పురస్కారం దక్కుతుంది. ‘అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం గానూ ట్రిపులార్ సత్తా చాటింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులను గెలుచుకుంది. మరి, ఇన్ని ప్రతిష్టాత్మక అవార్డులను నెగ్గిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం.. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారంగా పిలిచే ఆస్కార్స్‌లో ఎంతమేర సత్తా చాటుతుందో చూడాలి.
Follow Us