Puri Musings: జీవితంలో సగం గొడవలు అందుకే వస్తున్నాయి.. దయచేసి ‘తడ్కా’ తగ్గిద్దామంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్

Puri Musings: ఎప్పుడైనా సరే జరిగిందే చెప్పాలని, అడిగితే మీ అభిప్రాయాన్ని చెప్పండని.. లేకపోతే మానేయండని దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించారు

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘లైగర్’ (Liger) ఫ్లాప్‌తో కాస్త డీలాపడ్డారు. విజయ్ దేవరకొండతో తెరకెక్కిద్దామనుకున్న ‘జనగణమన’ చిత్రం అటకెక్కినట్లే కనిపిస్తోంది. దీంతో ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలాఉంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ (Puri Musings) పాడ్‌కాస్ట్‌లకు కొంతకాలం విరామం ఇచ్చిన ఈ క్రేజీ డైరెక్టర్ వాటిని మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్‌లను ఆడియెన్స్‌కు వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు కాబట్టి వంటల సబ్జెక్టును ఎంచుకున్నారేంటని అనుకునేరు!. మరి, పూరీ చెప్పిన ఆ తాలింపు సంగతులేంటో తెలుసుకుందాం పదండి..

‘మనం అప్పుడప్పుడు ఏదైనా పనికోసం ఒక మనిషిని మరో మనిషి దగ్గరకు పంపిస్తాం. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది తప్ప మిగిలినవన్నీ చెబుతాడు మనం వెళ్లమని చెప్పిన వ్యక్తి. ఏం జరిగింది? అని అడిగితే.. ‘మంచి రోజులుకావు. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. డబ్బు ఎక్కువవ్వడం వల్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావ్‌’ అని మనం పంపించిన మనిషి సమాధానం ఇస్తాడు. ఇదంతా కాదు ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే.. ‘డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు’ అని బదులిస్తాడు. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడకి తీసుకొచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు దీనివల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనే దాన్ని మనం గ్రహించాలి. మధ్యవర్తులంటే ఎవరో కాదు అదీ మనమే’ అని పూరీ జగన్నాథ్ (Puri Jagannath) చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్టేనని.. తడ్కా లేకుండా ఎవరూ మన దగ్గరకు ఏ వంటకాన్నీ తీసుకురారని పూరీ తన మ్యూజింగ్‌లో అన్నారు. ‘మనమంతా పుట్టుకతోనే మంచిగా వండటం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాం. ఐదుసార్లు తాలింపు వేయడం అయ్యాక మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకొస్తాడు. వాసన చూసి బాగుందని అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా సరే జరిగిందే చెప్పాలి. అడిగితే మీ అభిప్రాయాన్ని చెప్పండి.. లేకపోతే మానేయండి. ఇప్పుడు మనం ఎంత స్మార్ట్‌గా ఉంటున్నామో తడ్కా కూడా అలాగే ఉంటోంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం’ అని పూరీ జగన్నాథ్‌ అందరికీ విజ్ఞప్తి చేశారు.

Read more: విశాల్ (Hero Vishal) తాజా సినిమా ‘లాఠీ’ (Laththi).. ట్రైలర్ విడుదల తేదీ, సమయం ఫిక్స్..!

You May Also Like These