తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘వరిసు’ (Varisu). తెలుగులో ‘వారసుడు’గా తెరకెక్కుతోంది. విజయ్ సరసన హీరోయిన్‌గా తొలిసారి రష్మిక మందన్నా అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌పై సందిగ్ధత ఏర్పడింది.
ఈ ఒక్క సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న ‘వీరసింహా రెడ్డి’ ఇప్పటికే బెర్త్‌లను సిద్ధం చేసుకున్నాయి. తెలుగులో మంచి మార్కెట్ కలిగిన విజయ్ ‘వారసుడు’ (Varasudu) కూడా పొంగల్‌కే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. మూడు సినిమాలు ఒకేసారి వస్తుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో సంక్రాంతి పండుగకు తెలుగు చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని.. డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది.
ఇలాంటి ప్రకటనలతో మన మార్కెట్ దెబ్బతింటుంది: అశ్వినీదత్
తెలుగు సినీ నిర్మాతల మండలి రిలీజ్ చేసిన లేఖపై తమిళ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట తెలుగు చిత్రాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయిని.. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలను ఆపడం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ స్పందించారు. సంక్రాంతికి విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకూడదన్న ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని అశ్వినీదత్ (Aswani Dutt) కోరారు. ఇలాంటి ప్రకటనలు సినీ పరిశ్రమను తప్పుదోవ పట్టించడంతోపాటు పొరుగు పరిశ్రమలతో ఉన్న అనుబంధాలను, మన మార్కెట్‌ను దెబ్బతినేలా చేస్తున్నాయని పేర్కొన్నారు.
సంక్రాంతికి రిలీజ్ చేస్తే తప్పేంటి?
‘తెలుగు సినిమాలు మన దగ్గర ఎలా ప్రదర్శితం అవుతున్నప్పటికీ.. చాలా వరకు డబ్బింగ్ మార్కెట్, ఓటీటీ మార్కెట్ పుణ్యమా అని గట్టెక్కుతున్నాయి. తమిళంలో మన సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనువాద చిత్రాలకు మనం ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారు? ఇది సరికాదు. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడితో సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటే తప్పేముంది? మరో నిర్మాత మాత్రం ఒకేసారి తన రెండు సినిమాలు విడుదల చేసుకోవచ్చా? థియేటర్ల సమస్యే వస్తుంటే నా సినిమాపై మరో సినిమా ఎందుకని నిర్మాతకు చెప్పుకోవచ్చు కదా. నిర్మాతల మండలి ప్రకటనను నేను ఖండిస్తున్నా’ అని అశ్వినీదత్ స్పష్టం చేశారు.
Follow Us