సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ వచ్చినా ఫలానా దర్శకుడితో పని చేయలేకపోయాం, ఫలానా నటుడితో కలసి నటించలేకపోయామనే బాధ కొందరిలో ఉంటుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్ తీసే సినిమాలో తమకు ఒక్క పాత్ర వచ్చినా చాలు అనుకునే నటులు ఎంతో మంది ఉన్నారు. దీనికి స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా అతీతం కాదు. అదే విధంగా నటనలో విలక్షణతను కనబరుస్తూ, ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే కమల్ హాసన్, విక్రమ్, ధనుష్, అమితాబ్ లాంటి వారితో కలసి నటించాలని కూడా యాక్టర్స్ కోరుకుంటారు. వీరితో ఒక్క చిత్రమైనా తీయాలని డైరెక్టర్స్ కోరుకుంటారు.
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)కు కూడా ఓ నటుడితో నటించాలనే కోరిక ఉందట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో ఒక్క సినిమాలోనైనా యాక్ట్ చేసినా చాలని ఈ అందాల భామ అన్నారు. ఒకవేళ ఆ అవకాశం వరిస్తే.. పారితోషికం వదులుకునేందుకూ తాను సిద్ధమని ఆమె చెప్పారు. ధనుష్ నటన అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. ఆయనతో కలసి యాక్ట్ చేసే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక భేటీలో నిధి పేర్కొన్నారు.
ఇకపోతే, స్టార్ ఇమేజ్ కోసం ఐదేళ్లుగా పోరాడున్నారు నిధి. తొలుత హిందీ చిత్రపరిశ్రమలోకి ప్రవేశం చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారామె. అయితే ఇక్కడ యాక్ట్ చేసిన ‘హలో’, ‘సవ్యసాచి’ చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన జతకట్టిన ‘ఇస్మార్ట్ శంకర్’ సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నిధి నటిస్తున్నారు.
ఇకపోతే, తమిళంలో నిధికి అదృష్టం కలసిరావడం లేదు. శింబుతో చేసిన ‘ఈశ్వరన్’ చిత్రం ఆశించినంతంగా సక్సెస్ కాలేదు. ఇక జయం రవి సరసన నటించిన ‘భూమి’ మూవీ బాగుందనిపించినా, అది ఓటీటీలో విడుదల కావడంతో నిధి కెరీర్‌కు ప్లస్ కాలేకపోయింది. తాజాగా ఉదయ నిధి స్టాలిన్‌తో జతకట్టిన ‘కలగ తలైవన్’పై నిధి అగర్వాల్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం కూడా ఆమెకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో తదుపరి ఏంటనే అయోమయంలో ఆమె పడిపోయారు. మరి, త్వరలో ఆమెకు మంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.
Follow Us