Aadhi Pinishetty-Nikki Galrani: పెళ్లి తర్వాత కెమెరా కంటపడ్డ చూడముచ్చటైన జంట ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ!

Published on Jun 06, 2022 05:47 PM IST

Aadhi Pinishetty-Nikki Galrani: నటుడు ఆది పినిశెట్టి.. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కి బాగా సుప‌రిచితం. ఆయన హీరోగానే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లోనూ న‌టించి మెప్పించాడు. అయితే, ఇటీవల ఆది పినిశెట్టి.. అందాల భామ, హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దలని ఒప్పించి వివాహ బంధంతో ఈ మధ్యే ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యుల, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆది, నిక్కీ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇక‌, వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కూడా వైభవంగా జరిగింది. 

కాగా, రిసెప్షన్ పార్టీకి కోలీవుడ్ (Kollywood) నుంచి అతిరథ మహారధులు హాజరై.. నవ దంపతులని ఆశీర్వదించారు. చెన్నైలో జరిగిన ఈ రిసెప్షన్ కు లెజెండ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కూడా హాజరు కావడం విశేషం. అలాగే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, హీరో జీవా, అరుణ్ విజయ్, నటుడు నాజర్, డైరెక్టర్ హరి.. ప్రీత దంపతులు అతిథులుగా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ కొత్త జంట పెళ్లి తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిమానులతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు.
 
కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్‌ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం ‘ది వారియర్‌’ (The Warrier) మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు.

అయితే ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో (Social Media) చర్చ జరుగుతోంది. ఎంత లవ్‌ మ్యారేజ్‌ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది కట్నకానులకు బద్ధ వ్యతిరేకి అని, పెళ్లికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారట. ఆది ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిక్కీ కుటుంబం రెడీగా ఉన్నా అతడు మాత్రం పైసా కూడా వద్దని సున్నితంగా తిరస్కరించాడట. ఆది మంచి మనసుకు అతడి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.