Sai Pallavi: నాచుర‌ల్ యాక్ట్రెస్ సాయి ప‌ల్ల‌వికి సినిమా అవ‌కాశాలు లేవా?

Published on May 16, 2022 07:46 PM IST

నాచుర‌ల్ యాక్ట్రెస్ సాయిపల్లవి (Sai Pallavi) అంటే సహజమైన అందానికి, సహజమైన నటనకు, సహజమైన డాన్సులకు కేరాఫ్ అడ్ర‌స్. ఇటీవ‌లే శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో దేవ‌దాసి పాత్ర‌లో న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది ఈ హీరోయిన్. చాలా రోజులుగా ఏ సినీ ఈవెంట్లోని క‌నిపంచ‌ని ఈ బ్యూటీ ఇటీవ‌లే ఆడ‌వాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత కూడా మ‌ళ్లీ ఎక్క‌డా క‌నిపించలేదు. అంతేకాకుండా ఆమె సినిమాల‌కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.

సాయిపల్లవి (Sai Pallavi) తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సెంతామరై కన్నన్, రాధామణి. కాగా, ఈ హీరోయిన్ కు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే అమితాసక్తి ఉండేది. ఎలాంటి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో సైతం ఈ బ్యూటీ పోటీ ప‌డింది. జార్జియాలో టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసించింది. వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో  తెర‌కెక్కించిన‌ ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం రావడం ద్వారా.. ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. 

ఆ త‌ర్వాత టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించి కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కోసం సాయిప‌ల్ల‌వి తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. ఇక‌, ఆ తర్వాత వ‌రుస‌గా నాచుర‌ల్ స్టార్ నాని సరసన ఎంసిఏ చిత్రం లో.. సూర్యా 36, కణం, మారి 2, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలలో నటించింది. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి చేతిలో రానాతో క‌లిసి న‌టిస్తున్న విరాట ప‌ర్వం (Virata Parvam) సినిమా మిన‌హా మ‌రే మూవీ లేదు.