మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artist Association) ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం వాటిని నెరవేర్చామని మంచు విష్ణు (Vishnu Manchu) అన్నారు. గతేడాది ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు.. ఆ పదవిని చేపట్టి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా తన కార్యవర్గంతో కలసి గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో తమ కార్యవర్గం చేపట్టిన పలు కార్యక్రమాలు, తీసుకున్న కీలక నిర్ణయాల గురించి విష్ణు వివరించారు. తాను వ్యక్తిగతంగా ఇచ్చిన ‘మా’ భవనం హామీ గురించి కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నేను ఆడియెన్స్‌కు జవాబుదారీ
‘మా’ భవనం విషయంలో ఇటీవల జరిగిన ఏజీఎంలో తాను రెండు ప్రతిపాదనలు సూచించానని విష్ణు తెలిపారు. ‘మా’ భవనం విషయంలో ఇచ్చిన హామీకి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. ‘‘మా’ బిల్డింగ్ కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న ఓ భవనాన్ని చూశాం. మరో ఆరు నెలల్లో ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుంది. ఇది వద్దనుకంటే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. అక్కడ ‘మా’ కోసం కొంత స్పేస్‌ను నా సొంత డబ్బులతో కొంటా. దీనికయ్యే ఖర్చును నేను భరిస్తాను. అయితే దీనికి మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ రెండింటిలో సెకండ్ ఆప్షన్ వైపే సభ్యులందరూ మొగ్గు చూపారు’ అని విష్ణు వివరించారు. తాను ‘మా’కు మాత్రమే కాదు.. ప్రేక్షకులందరికీ జవాబుదారీనని విష్ణు పేర్కొన్నారు.
‘మా’కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే సస్పెండ్ చేస్తాం
‘గతేడాది ‘మా’ ఎన్నికల సందర్భంగా మేం ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకూ దాదాపు 90 శాతం హామీలు పూర్తయ్యాయి. ఈ అసోసియేషన్‌లో కొందరు నటులుకాని సభ్యులు కూడా ఉన్నారు. అందుకే సభ్యత్వం విషయంలో మేం కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. నటీనటుల విషయంలో రెండు సినిమాల్లో యాక్ట్ చేసి, ఆ చిత్రాలు విడుదలైతేనే వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తాం. అదే క్యారెక్టర్ ఆర్టిస్టులైతే కనీసం పది సినిమాల్లోనైనా నటించి ఉండాలి. ఐదు నిమిషాలైనా మూవీలో కనిపించాలి. అసోసియేట్ సభ్యులకు ‘మా’లో ఓటు హక్కు లేదు. సభ్యత్వం ఉన్న వారినే సినిమాల్లో నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా నటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది’ అని విష్ణు స్పష్టం చేశారు.
Follow Us