Major: నా కెరీర్‌లో ఇప్పటివరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడలేదంటున్న శోభితా ధూళిపాళ్ల
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తొలి పాన్ ఇండియా మూవీ 'మేజర్' (Major). ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మించింది. ముంబయిలో జరిగిన 26/11 అటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.
కాగా, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఇందులో భాగంగా కెమెరాలకు కూడా పోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, శోభితా ధూళిపాళ్ల పంచుకున్న మేజర్ (Major) సినిమా విశేషాలు.. ‘‘నా కెరీర్‌లో నేను ఎక్కువగా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం వల్లనేమో నన్ను అందరూ సీరియస్‌గానే చూస్తున్నారు. కానీ నేను చాలా హ్యాపీ గాళ్‌ని. నాకు సరదాగా, ఫన్నీగా ఉండే అమ్మాయి పాత్రలు కూడా చేయాలని ఉంది’’ అని అన్నారు. ‘మేజర్’లో బందీ అయిన ఎన్‌ఆర్‌ఐ యువతి ప్రమోద అనే పాత్ర చేశానని ఆమె తెలిపింది.
అయితే, 26/11 (26/11 Attacks) దాడులు జరిగినప్పుడు ఎంతో భయాన్ని, బాధను బందీలు అనుభవించి ఉంటారని.. దీంతో వారిలా ఆలోచించి ఈ సినిమా చేశానని ఆమె పేర్కొంది. అయితే, నా కెరీర్‌లో ఇప్పటివరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడలేదు. ప్రమోద పాత్ర చేశాక ఇక యాక్టర్‌గా లైఫ్‌లో నాకు గ్లిజరిన్ అవసరం ఉండదేమో అనిపిస్తోంది. ఇది అంత బరువైన, భావోద్వేగంతో కూడిన పాత్ర అని వివరించింది శోభితా.