ANR Birth Anniversary : సినీ జగత్తుకే ఓ కీర్తి శిఖరం.. "అక్కినేని నాగేశ్వరరావు" నటించిన టాప్ 10 చిత్రాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లు దాటి, ఆణిముత్యాల వంటి సినిమాలను అందించిన లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు (ANR)

ఏఎన్నార్.. (Akkineni Nageshwara Rao) ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. సాంఘిక చిత్రాలలో ఆయనకు ఆయనే సాటి. కొన్ని వందల పాత్రలలో అలవోకగా నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెలలో చిరస్థాయిగా మిగిలిపోయారు ఆయన. ఏఎన్నార్ జీవితం ఒక చరిత్ర. ఆయన నటించిన ప్రతి సినిమా ఓ జీవిత సత్యం. ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, ఆయన నటించిన టాప్ 10 సినిమాల గురించిన ఈ కథనం మీకోసం ప్రత్యేకం. 

కీలు గుర్రం (Keelu Gurram) : 1949 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన "కీలు గుర్రం" చిత్రానికి మీర్జాపురం రాజావారు దర్శకత్వం వహించారు. ఘంటశాల సంగీతం అందించారు. తెలుగు చలనచిత్రాలలో జానపద కథలకు నాంది పలికిన చిత్రం "కీలు గుర్రం". రాజకుమారుడు విక్రముడు తన తల్లికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ .

 

దేవదాసు (Devadasu) : 1953 లో విడుదలైన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం దర్శకత్వం వహించారు. తన ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై మరణించే ఓ భగ్న ప్రేమికుడి కథ ఈ చిత్రం. ఈ చిత్రంలో ఏఎన్నార్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి

తెనాలి రామకృష్ణ (Tenali Ramakrishna) : 1956 లో బిఎస్ రంగా దర్శకత్వంలో అక్కినేని తెనాలి రామలింగడి పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ రాయల వారి పాత్ర పోషించారు. తన రాజ్యం ఇరకాటంలో పడినవేళ, తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా బాదుషా వారి వద్దకు చేరి సమస్యను వివరించి, తన రాజుకు మేలు చేస్తాడన్నదే చిత్రకథ.

సుడిగుండాలు (Sudi Gundalu) : ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు న్యాయవాదిగా నటించిన చిత్రం "సుడిగుండాలు". న్యాయమూర్తి చంద్రశేఖరం పాత్రలో ఇందులో అక్కినేని ఒదిగిపోయారు. యువతరం నేరాలు చేసేంతగా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులేనన్న జీవిత సత్యాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 1967 లో ఈ సినిమా విడుదలైంది. 

 

మరో ప్రపంచం (Maro Prapancham) : ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970 లో విడుదలైంది. ఈర్ష్య, ద్వేషం, శత్రుత్వం, కుల ఘర్షణలు లేని మరోప్రపంచం అనే ప్రత్యేక ప్రపంచాన్ని కనిపెట్టిన రవీంద్ర అనే సిబిఐ ఆఫీసర్ కథ ఇది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను ఎలా బోధించాలనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది.

దసరా బుల్లోడు (Dasara Bullodu) : 1971 లో విడుదలైన ఈ సినిమాకి వి.బి. రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఆయనే నిర్మాత కూడా. ఈ సినిమా తర్వాత ఏఎన్నార్, వాణిశ్రీ హిట్ పెయిర్‌గా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. ఓ కుటుంబంలో మనస్పర్థల వలన విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ ఎలా కలుసుకుంటారన్నదే ఈ సినిమా కథ. 

 

ప్రేమనగర్ (Prem Nagar) : 1971 లో విడుదలైన ఈ చిత్రంలో అక్కినేని జల్సారాయుడిగా, లవర్ బాయ్‌గా, భగ్న ప్రేమికుడిగా ఒకే పాత్రలో విభిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు కె ఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు.

ప్రాణదాత (Prana Daata) : మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1992 లో విడుదలైంది. గతాన్ని మర్చిపోయిన ఓ గొప్ప డాక్టర్ ఏ విధంగా తన వైద్యవిద్యతో ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తూ చరిత్ర సృష్టిస్తాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చక్రవర్తి అనే డాక్టర్ పాత్ర పోషించారు. తన శస్త్రచికిత్సా జ్ఞానాన్ని తిరిగి పొంది, ఓ కుర్రాడికి విజయవంతమైన ఆపరేషన్ చేసిన వ్యక్తిగా ఆ పాత్రను ఏఎన్నార్ అద్భుతంగా పోషించారు.

సీతారామయ్య గారి మనవరాలు (Seetaramayya Gari Manavaralu) :1991 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో తెలుగు సంప్రదాయ, సంస్కృతులతో పాటు పల్లెల్లో కనిపించే బాంధవ్యాలు, అభిమానాలను చాలా చక్కగా తెరకెక్కించారు. తనను విడిచి విదేశాలకు వెళ్లిపోయిన కొడుకు మీద కోపంతో మనవరాలిపై అలిగిన ఆసామి సీతారామయ్య పాత్రలో అక్కినేని నటన.. ఆయన అనుభవాన్నంతా రంగరించి పాత్రను పోషించిన తీరు అద్భుతమనే చెప్పాలి.

మనం (Manam) : అక్కినేని నాగేశ్వరావు తన కొడుకు నాగార్జునతో పాటు మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి నటించిన సినిమా "మనం". ఈ సినిమా ఒకరకంగా ఆయనకు ట్రిబ్యూట్ లాంటిది. 2014 లో విడుదలైన ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. గత జన్మలో విడిపోయిన తల్లిదండ్రులను తిరిగి ఈ జన్మలో కలపడానికి ఓ కొడుకు చేసే ప్రయత్నమే ఈ కథ.

 

 

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఏఎన్నార్ నటించిన ఎన్నో చిత్రాలు భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఎందరో నూతన దర్శకులకు, నటులకు పాఠాలుగానూ మారాయి. 

ANR Lives On !

Read More:  నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో .. కొత్త చిత్రం NC22 షూటింగ్ రేపటి నుండే ప్రారంభం !

Credits: Instagram
You May Also Like These