Shiva karthikeyan: టాలీవుడ్ మార్కెట్ పై గురిపెట్టిన కోలీవుడ్ హీరో !
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Shiva karthikeyan) .. పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో హంగామా చేస్తున్నాడు. మరోవైపు సైలెంట్‌గా తెలుగు మార్కెట్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఆయన నటించిన 'రెమో' సినిమా టాలీవుడ్ (Tollywood) లో తనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. దీంతో శివ కార్తికేయన్ సినిమాలు అనేకం తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి.
ఇప్పటికే ‘వరుణ్ డాక్టర్’ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి హిట్ కొట్టాడు శివ కార్తికేయన్. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అదే సినిమాను 'డాక్టర్ వరుణ్' పేరుతో తెలుగులో విడుదల చేయగా.. ఈ సినిమా టాలీవుడ్‌లో కూడా మంచి విజయాన్ని సాధించింది.
ఇలా 'డాక్టర్' సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న శివ కార్తికేయన్, తాజాగా 'కాలేజ్ డాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, శివ కార్తికేయన్ సరసన కథానాయికగా నటించింది. 'కాలేజ్ డాన్' మూవీ తమిళ, తెలుగు భాషలలో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయిన 'కాలేజ్ డాన్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే టాక్ తెచ్చుకుని.. కలెక్షన్లను కూడా అదిరిపోయే రేంజ్లో సాధిస్తోంది.
వరుసగా రెండు హిట్లు కొట్టిన ఈ హీరో, తన తదుపరి సినిమా కూడా హిలేరియస్ ఎంటర్టైనరే అని తెలిపాడు. ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్‌తో హిలేరియస్ సినిమా ప్లాన్ చేసుకొని, టాలీవుడ్ మార్కెట్ మరింత పెంచుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి తమిళ్ హీరోల్లో కొందరికి మాత్రమే, తెలుగులో ఇప్పుడు మార్కెట్ ఉంది. సూర్య, ఆర్య, విశాల్, కార్తీ ఇలా కొందరు హీరోలు మాత్రమే.. ఇక్కడ మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. ఆ కోవలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు శివ కార్తికేయన్.
మరి డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్‌లో మంచి వసూళ్ళు అందుకున్న ఈ యంగ్ హీరో.. డైరెక్ట్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే.. తాజాగా శివ కార్తికేయన్, టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ " నేను బ్రహ్మానందం గారికి చాలా పెద్ద అభిమానిని, బ్రహ్మానందంకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. నాకు భాష అర్థం కాకపోయినా కూడా, బ్రహ్మానందం హావభావాలను అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను" అని తెలియజేశాడు.