జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) సింప్లిసిటీకి కన్నడ ఫ్యాన్స్ ఫిదా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారక్ వీడియో!

‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) సింప్లిసిటీ చూసి కన్నడ అభిమానులు ఫిదా అవుతున్నారు

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ‘సింప్లిసిటీ అంటే ఇదీ’ అంటూ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అవుతున్నారు.  

‘కర్ణాటక రాజ్యోత్సవ’ (Karnataka Rajyotsava) వేడుకల వేదికపై ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన సమయంలో వర్షం కురిసింది. దీంతో సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిశాయి. వాటిల్లోని ఓ కుర్చీని క్లాత్‌తో తుడిచి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) భార్య అశ్వినీని ముందు కూర్చోబెట్టారు ఎన్టీఆర్‌ (Junior NTR). మరో కుర్చీలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిని కూర్చోమని చెప్పి.. మహిళలపై తనకున్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. ఆ తర్వాత, తాను కూర్చోబోయే కుర్చీనీ తారక్ శుభ్రం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ విజువల్స్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్‌ను మెచ్చుకుంటున్నారు. 

ఇకపోతే, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar)కు ‘కర్ణాటక రత్న’ (Karnataka Ratna) పురస్కారాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, రజినీకాంత్‌ (Rajinikanth), ఎన్టీఆర్‌లు పునీత్‌ సతీమణి అశ్వినీకి ఆ అవార్డును అందజేశారు. పునీత్‌ గురించి కన్నడలో ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.

నటుడిగా కాదు.. పునీత్ మిత్రుడిగా ఇక్కడికొచ్చా: ఎన్టీఆర్

‘కర్ణాటక రత్న’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పునీత్‌ రాజ్‌కుమార్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘పునీత్‌ నవ్వులో ఉన్న స్వచ్ఛతను మరెక్కడా చూడలేదు. అహంకారాన్ని పక్కనపెట్టి, యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్‌ రాజ్‌కుమార్‌. గొప్ప వ్యక్తిత్వాన్ని స్వయంగా సాధించారు. పునీత్‌ సూపర్‌‌స్టార్‌గా, గాయకుడిగా, మంచి భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా తనదైన ముద్రవేశారు. పునీత్‌కు ‘కర్నాటక రత్న’ ప్రదానం చేయడంతో ఈ పురస్కారానికి ఓ సార్థకత చేకూరింది. ఈ కార్యక్రమానికి నటుడిగా సాధించిన అర్హతతో కాకుండా పునీత్‌కు మంచి మిత్రుడిగానే వచ్చా. నన్ను పొరుగు రాష్ట్రానికి చెందిన యాక్టర్‌గా కాకుండా తమలో ఒకడిగా భావించే రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు’ అని తారక్ చెప్పుకొచ్చారు.

తక్కువ వయసులోనే పునీత్ ఎంతో సాధించారు: రజినీకాంత్

ఈ వేడుకలో పాల్గొన్న రజినీకాంత్ కూడా పునీత్ రాజ్‌కుమార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో మార్కండేయ, భక్తప్రహ్లాద ఎలాగో కలియుగంలో పునీత్ రాజ్‌కుమార్ అలా అని తలైవా అన్నారు. ఓ నటుడు 60 ఏళ్లలో సాధించే కీర్తిని పునీత్ కేవలం 21 ఏళ్లలోనే సాధించారని చెప్పారు. అభిమానులు ముద్దుగా ‘అప్పూ’ అని పిలిచే పునీత్ దేవమానవుడని రజినీకాంత్ పేర్కొన్నారు. 

Read more: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేకుండానే 'హరిహర వీరమల్లు' (HariHara Veeramallu) యాక్షన్ సీక్వెన్స్..?

You May Also Like These