నందమూరి తారకరామారావు (జూనియర్) .... తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్‌గా (Junior NTR) సుపరిచితులు. ఈయనను "తారక్" అని కూడా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఏ పాత్రలోనైనా సరే సులువుగా పరకాయ ప్రవేశం చేయగల నేర్పు, తెగువ కలిగిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజు ఆయన నటించిన సినిమాలలోని టాప్ 10 పాత్రల గురించి "పింక్ విల్లా తెలుగు" అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం ప్రత్యేకం !
శ్రీరాముడు (బాల రామాయణం)
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన "బాల రామాయణం" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) శ్రీరాముడి పాత్రలో ఒదిగిపోయాడు. నీలమేఘ శ్యాముడిగా అంత చిన్నవయసులోనే అద్భుతంగా నటించాడు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ప్రముఖ నాట్యకారిణి స్మితా మాధవ్ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా సీత పాత్రలో నటించడం విశేషం.
చారి (అదుర్స్)
"అదుర్స్" చిత్రంలో బ్రాహ్మణ యువకుడైన నరసింహాచారి పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే క్రమంలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంతో, ఎన్టీఆర్ (Junior NTR) పోటాపోటీగా నటించాడు. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.
యంగ్ యముడు (యమదొంగ)
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "యమదొంగ" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ యముడి సింహాసనాన్ని అధిరోహించే సామాన్య మానవుడి పాత్రలో నటించాడు.
యముడి సింహాసనాన్ని చేజిక్కించుకున్న "యంగ్ యముడి" పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. యముడి పాత్రలో నటించిన మోహన్ బాబుతో ఎన్టీఆర్ (Junior NTR) కూడా పోటా పోటీగా నటించాడు.
సింగమలై (సింహాద్రి)
"సింహాద్రి" సినిమాలో తనకు మేలు చేసిన ఓ కుటుంబానికి అన్యాయం చేసిన విలన్ల ఆటకట్టించేందుకు కేరళ ప్రాంతంలో "సింగమలై"గా అవతారమెత్తుతాడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ఎస్ ఎస్ రాజమౌళికి ఈ చిత్రం ఎంతో పేరు తీసుకొచ్చింది.
రాఖీ (రాఖీ)
రాఖీ.. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంలో వరకట్న బాధితురాలైన తన చెల్లెలికి జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదని భావిస్తాడు కథానాయకుడు.
అందుకే సమాజంలో ఆడపిల్లల మాన, ప్రాణ సంరక్షణ కోసం వారికి అండగా నిలబడతాడు. ఈ క్రమంలో మగువల కన్నీళ్ళకు కారణమయ్యే ముష్కరుల ఆట కట్టిస్తాడు. కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.
ఇన్స్‌పెక్టర్ దయా (టెంపర్)
"టెంపర్" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అవినీతిపరుడైన ఇన్స్‌పెక్టర్ దయా పాత్రలో నటించాడు. అయితే ఇదే పాత్ర తర్వాత చిత్రంలో ఎంతో ఉదాత్తమైన పాత్రగా మారిపోతుంది. ఆడపిల్లల మానాలను హరించిన నరరూప రాక్షసులకు శిక్షపడేలా చేస్తుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
అభిరామ్ (నాన్నకు ప్రేమతో)
"నాన్నకు ప్రేమతో" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అభిరామ్ పాత్రలో నటించాడు. తన తండ్రికి అన్యాయం చేసిన ఓ ప్రముఖ వ్యాపార దిగ్గజం పై పగ తీర్చుకోవడం కోసం, టెక్నాలజీని తనకు అనువుగా వాడుకొనే యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎన్టీఆర్ నటన ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది.
జై లవకుశ (త్రిపాత్రాభినయం)
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తన కెరీర్‌లో తొలిసారిగా "జై లవకుశ" చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. తన కుటుంబంలో తన పట్ల చూపించిన వివక్షత వల్ల చెడ్డవాడిగా మారిన "జై" పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి.
ఈ పాత్ర రామాయణంలోని రావణుడిని పోలి ఉంటుంది. ఈ పాత్రకు సోదరులుగా వ్యవహరించే లవ, కుశ అనే రెండు పాత్రలు కూడా ఇదే సినిమాలో ఉంటాయి. ఈ పాత్రలను కూడా జూనియర్ ఎన్టీఆరే పోషించారు.
ఆనంద్ (జనతా గ్యారేజ్)
జనతా గ్యారేజ్ చిత్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్న యంగ్ స్కాలర్ ఆనంద్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) చాలా బాగా నటించాడు.
అయితే ఇదే పాత్ర సినిమా ద్వితీయార్థంలో పేద ప్రజలకు అండగా నిలిచే "జనతా గ్యారేజ్" అనే ఒక టీమ్‌కు మద్దతుగా నిలుస్తుంది. "జనతా గ్యారేజ్" వ్యవస్థాపకుడైన సత్యం (మోహన్ లాల్) పాత్రకు వెన్నెముకగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత మోహన్‌లాల్‌తో కలిసి పోటా పోటీగా నటించాడు జూనియర్ ఎన్టీఆర్.
కొమురం భీముడు (ఆర్ఆర్ఆర్)
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) నటనా పటిమను ప్రపంచానికి చాటిన సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రంలో కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. తెలంగాణలో గోండు జాతీయుల హక్కులకై పోరాడిన విప్లవకారుడు కొమురం భీమ్‌ని పోలి ఉంటుంది ఈ పాత్ర.
"ఆర్ఆర్ఆర్" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అంతర్జాతీయ చలనచిత్ర విశ్లేషకుల ప్రశంసలు కూడా దక్కడం విశేషం. "వెరైటీ" అనే హాలీవుడ్ పత్రిక ఎన్టీఆర్ నటనను ప్రత్యేక ప్రస్తావిస్తూ, ఆస్కార్ అవార్డు పొందేందుకు అర్హత ఉన్న నటుడని కితాబివ్వడం విశేషం.
ఏదేమైనా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను చెప్పుకోవచ్చు. తెలుగు భాషను స్పష్టంగా పలకగలిగిన నైపుణ్యం ఎన్టీఆర్ సొంతం. అలాగే డ్యాన్స్‌లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ కలిగిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఆయనను మనం కచ్చితంగా "సకలగుణాభిరాముడ"ని పిలుచుకోవచ్చు.
Follow Us