'తొలివలపు* సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. వర్షం, జయం, నిజం సినిమాల్లో విలన్‌గా మెప్పించి నటనలో తన ప్రతిభను నిరూపించుకున్న హీరో గోపీచంద్. తర్వాత హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా యాక్షన్, కామెడీ కథలను సెలక్ట్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.. తాజాగా నేను 'పక్కా కమర్షియల్ ' అంటూ ప్రేక్షకులకు మరోసారి వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నాడు గోపీచంద్ (Gopichand).
మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'పక్కా కమర్షియల్ ' సినిమా జూలై 1వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో గోపీచంద్ మీడియాతో మాట్లాడాడు. వ్యక్తిగతమైన విషయాలతో, సినిమాకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు ఈ కమర్షియల్ హీరో. ఇంటర్వ్యూలో గోపీచంద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
'పక్కా కమర్షియల్ ' సినిమాలో స్టైలిష్‌గా కనిపించాలని ప్రత్యేకంగా ఏం చేయలేదు. కాస్ట్యూమ్స్ వల్ల అలా కనిపిస్తున్నాను. లుక్‌లో చాలా మార్పులు వచ్చి ఉండవచ్చు. కానీ ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా ఈ సినిమాలో నన్ను బాగా చూపించారు.
యాక్షన్ కలిపితే ప్లస్ అవుతుందని..
పక్కా కమర్షియల్ సినిమా ఓకే చేయక ముందు డైరెక్టర్ మారుతితో అంతగా పరిచయం లేదు. 'మారుతితో సినిమా చేద్దామని అనుకుంటున్నాను.. హీరోగా చేస్తావా ' అని నిర్మాత వంశీ అడిగారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చేసే మారుతి.. వాటికి యాక్షన్ కూడా జోడిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని అన్నాను. కథ వినమని చెప్పారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మారుతి వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత సినిమాకు పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెడుతున్నామని అన్నాడు. కథ విన్న తర్వాత సలహాలు ఇచ్చే చాన్స్ మారుతి ఇవ్వలేదు. ఎందుకంటే కథను అంత బాగా రాశాడు మారుతి.
అందరూ కమర్షియల్‌గానే..
ప్రతి ఒక్కరూ కమర్షియల్‌గానే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ రాశాడు మారుతి. లాయర్‌గా నటించాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఆ నమ్మకం ఉంది. కొంతమంది డబ్బు కోసమే బతుకుతారు. కొందరు అవసరానికి సంపాదిస్తుంటారు. నా పనికి ఎంత తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుంటాను. దానికంటే ఎక్కువగానీ, తక్కువగానీ తీసుకోను.
ఎవరికైనా నేను సహాయం చేయాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి. అందుకే డబ్బు విషయంలో రాజీపడను. మిగిలిన విషయాల్లో నేను కమర్షియల్ కాదు. మారుతి సినిమాల్లో హీరోను ఎక్కువగా ఎలివేట్ చేస్తుంటాడు. కథను హీరో నడిపిస్తూ ఉంటాడు. అందుకు తగినట్టుగానే డైలాగ్స్ రాశాడు మారుతి.
మారుతి స్పీడ్‌ను అందుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు తప్పితే మిగిలిన విషయాలను షేర్ చేయను. అయితే మెసేజ్‌ల ద్వారా అప్పుడప్పుడూ అభిమానులను పలకరిస్తూ ఉంటాను.
హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే..
నా పాకెట్ మనీ అప్పట్లో రూ. 1, స్కూల్ డేస్‌లో రూ. 2. ఇక, జయం సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్. రూ.11,000 మాత్రమే. జయం సినిమా డైరెక్టర్ లక్కీ నంబర్ 11. విజయాన్ని బట్టి రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను అని చెప్పాడు గోపీచంద్ (Gopichand).
Read More: మీతో సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరో కాదురా.. విలన్ !
Follow Us