ఎయిర్ పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda), హీరో రామ్ (Hero Ram)

Published on Apr 29, 2022 08:26 PM IST

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం భూత‌ల స్వ‌ర్గం కశ్మీర్‌లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కాగా, శివ నిర్వాణ.. నాని తో రూపొందించిన‌ టక్ జగదీష్ సినిమా ఫ్లాప్ తరువాత తెరకెక్కిస్తోన్న చిత్రమిదే కావ‌డం విశేషం. మ‌రోవైపు, సమంత మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ మళ్లీ ఈ సినిమా చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఓ స్వీట్ సర్ప్రైజ్ తో సామ్ ను థ్రిల్ చేశారు.   దానికి సంబంధించిన వీడియోను విడుదల చేయగా, అది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌ షూటింగ్‌ సీన్‌ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సమంతతో రిహార్సల్ చేయించారు. దీంతో సామ్... యాక్షన్‌ అనగానే లవ్‌ ఫీల్‌తో విజ‌య్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆ డైలాగ్‌ను చెబుతుండగా, హ్యాపీ బర్త్‌డే సమంత అంటూ  చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. సరిగ్గా 12 గంటలకు అంటే 28వ తేదీ ఎంటర్ అయ్యే సమయానికి ఆ షూటింగ్ కొనసాగుతోంది.  

కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ మొన్న‌టి వ‌ర‌కు పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ షూటింగ్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 25న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.  ఈ సినిమా షూటింగ్ ఈ మ‌ధ్యే పూర్తి కావ‌డంతో ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలోని సినిమాపై ద‌ష్టి పెట్టారు. అయితే, పూరి జ‌గ‌న్నాథ్ త‌దుప‌రి మూవీ సైతం విజ‌య్ దేవ‌ర‌కొండతోనే చేస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు. 

పూరి జ‌గ‌న్నాథ్, శివ నిర్వాణ సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సైతం ఓ సినిమా చేయ‌నున్నాడు. అనంత‌రం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ఈ రౌడీ హీరో తాజాగా ఎయిర్ పోర్టు వ‌ద్ద‌ బ్లాక్ టీ ష‌ర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. 

మ‌రోవైపు హీరో రామ్ పోతినేని సైతం అక్క‌డే క‌నిపించ‌డంతో ఫొటోగ్రాఫ‌ర్లు క్లిక్ మ‌నిపించారు. టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని హీరోగా త‌మిళ‌ డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ది వారియ‌ర్‌’ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, రామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో అక్ష‌ర గౌడ నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏకకాలంలో రూపొందుతోంది. రామ్ తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న ఈ సినిమా జులై14 న విడుద‌ల కాబోతోంది. 

ఇక‌, వారియర్ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ‘బుల్లెట్’ లిరిక‌ల్ సాంగ్‌ యూట్యూబ్‌లో 16 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ పాటలో హీరో హీరోయిన్లు రామ్, కృతి శెట్టి డ్యాన్స్ ఇర‌గ‌దీసారు. కాగా, ప్ర‌స్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి శ్రీ మ‌ణి సాహిత్యం అందించిగా త‌మిళ స్టార్ శింబు ఆలపించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.