సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఎల్ఎం కౌశిక్ (KaushikLM) హఠాన్మరణం చెందారు. 35ఏళ్ల వయసున్న కౌశిక్ నిద్రలోనే గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. కౌశిక్ మృతితో సినీపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి క్రిటిక్స్, చిత్ర ప్రముఖులు కౌశిక్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇక, కోలీవుడ్ (Kollywood) లో కౌశిక్ కు ఎంతో మంచి పేరుంది. సినిమాల విశేషాలు, కలెక్షన్లు తదితర అంశాలపై ఆయన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. ట్విట్టర్ లోనూ ఆయనకు 4లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాక్సాఫీస్ రిపోర్టులు, మూవీ అప్ డేట్స్ అందించడంలో ప్రసిద్ధి చెందారు.
పలువురు సెలబ్రిటీలను ఆయన చేసే ఇంటర్వ్యూలు కూడా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కాగా, చనిపోవడానికి ఆరు గంటల ముందు కూడా ఆయన 'సీతారామం' సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల గ్రాస్ ను సాధించిందని... ఇది అఫీషియల్ అని తెలిపారు.
వృత్తి రిత్యా ఇంజనీర్ అయిన కౌశిక్ ప్రముఖ తమిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్ వూడ్స్‌లో ఫిల్మ్ క్రిటిక్‌గా వృత్తిని ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్‌లను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ విపరీతమైన ఫాలోవర్స్‌ను ఏర్పరచుకున్నాడు. 'గలాట్టా' యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. కౌశిక్ మరణాన్ని గలాట్టా యూట్యూబ్ ఛానెల్ ధృవీకరించింది. "ప్రఖ్యాత సినీ విమర్శకుడు, మూవీ ట్రాకర్, గలాట్టా VJ @LMKMovieManiac గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన మరణం తమకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ట్వీట్ చేసింది.
ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh), కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో ధనుష్ (Dhanush), టెలివిజన్ యాంకర్ దివ్యదర్శిని సహా పలువురు ప్రముఖులు కౌశిక్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Follow Us