ఎన్టీఆర్ (NTR)కు విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమ బిరుదును ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Published on May 28, 2022 06:43 PM IST

నేడు ( మే 28) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి సంద‌ర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ రోజు తెల్ల‌వారుజామున‌ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో ఆయ‌న మ‌న‌వ‌లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వారు ఉద‌యాన్నే అక్క‌డికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇక మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ.. అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడే కాదు.. ప‌ర‌మేశ్వ‌రుడిగానూ రౌద్రాన్ని వెండితెర‌పై సాక్షాత్క‌రింపచేయ‌టం ఎన్టీఆర్ (NTR) కే చెల్లింది. సుయోధ‌నుడిగా తార‌క రాముడు న‌టించిన తీరు ఇప్ప‌టికీ మ‌నం గుర్తు పెట్టుకున్నామంటే ఆయ‌న ఆ పాత్ర‌ను పోషించిన విధానం మ‌రెవ్వ‌రికీ సాధ్యం కాలేదు. ఇక, చారిత్ర‌క పాత్ర‌లను సైతం ఎన్టీఆర్ పోషించి త‌న‌దైన ట్రెండ్ క్రియేట్ చేశారు. శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు, చంద్ర గుప్తుడు, బ్ర‌హ్మ నాయుడు, అక్బ‌ర్‌, వీర బ్రహ్మేంద్ర‌స్వామి, అశోకుడు, శ్రీనాథుడు వంటి పాత్ర‌లు చేసిన‌ ఆయ‌న న‌ట‌న అసామాన్యం. ఆ పాత్ర‌ల‌ను ఆయ‌న త‌ప్ప మ‌రొక‌రు అంత గొప్ప‌గా చేయ‌లేరేమో అనేలా న‌టించ‌టం ఆయ‌న ప్రత్యేక‌త‌. 

తెలుగు సినిమాకే మూల స్తంభంగా నిలిచిన నంద‌మూరి నాయ‌కుడు న‌ట‌న‌లోనే కాకుండా రాజ‌కీయాల‌లోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకున్న మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి నందమూరి తార‌క‌రామారావు (NTR). ఆయ‌న తన కెరీర్ లో చేసిన 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ఆయ‌న చేసిన‌ ప్ర‌తీ పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌ను చూసి సాధార‌ణ మ‌నుషులే కాదు.. ఎంద‌రిలో మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచిన కంచి కామ‌కోటి పీఠాధిప‌తి జ‌గ‌ద్గురు ప‌ర‌మాచార్య సైతం ప‌ర‌వ‌శమ‌య్యారు. అందుకే 1978వ సంవ‌త్స‌రంలో ఎన్టీఆర్‌కు (NTR) విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమ అనే బిరుదుని ప్ర‌దానం చేశారు జ‌గ‌ద్గురు. తెలుగు రాష్ట్రాలలో తమ అభిమాన నాయకుడు, నటుడు దేవుడిని కొలుస్తున్నారు ప్రజలు. అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ గా కూడా తారకరాముని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ కు ప్రముఖులు బారులు తీరుతున్నారు.