మెగాస్టార్ చిరంజీవి (Puri Jagannadh) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్రం దసరా కానుకగా విడుదలై.. విజయవంతంగా రన్‌ను కొనసాగిస్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వసూళ్లనే సాధిస్తూ, హిట్ వైపుగా దూసుకెళ్తోంది. దీపావళి వరకు పెద్ద సినిమాలేవీ రావడం లేదు కాబట్టి.. ‘గాడ్‌ఫాదర్’ కలెక్షన్లకు ఢోకా లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మూవీలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చిరును ఇంటర్వ్యూ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిరుతో మెగాస్టార్‌తో పూరీ ముచ్చటించారు. పూరీ అడిగిన పలు ప్రశ్నలకు చిరు నవ్వుతూ జవాబిచ్చారు.
మనసుకు నచ్చితేనే ఓకే చెబుతా
సినిమాల ఎంపికలో దేనికి ప్రాధాన్యత ఇస్తారని పూరి అడగ్గా.. కథే తనకు ముఖ్యమని చిరంజీవి అన్నారు. డైరెక్టర్లు స్టోరీ చెబుతున్నప్పుడే తాను విజువల్స్‌ను ఊహించుకుంటానన్నారు. అది తన మనసుకు నచ్చితేనే ఓకే చెబుతానని చెప్పారు. సాంగ్స్, ఫైట్స్ అలంకారం లాంటివని.. కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తే ఫెయిలయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చిరంజీవి పేర్కొన్నారు.
మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అని చిరును పూరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ప్రస్తుత లీడర్లలో ఎవరూ లేరన్నారు. అయితే లాల్ బహుదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్‌పేయీ అంటే తనకు బాగా ఇష్టమని చెప్పారు. వీరి హయాంలో దేశం మంచి పురోగతి సాధించిందన్నారు. సల్మాన్ ఖాన్‌తో తొలి పరిచయం గురించి మెగాస్టార్ మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో ఓ యాడ్ షూటింగ్ సమయంలో ఆయన్ని మొదటిసారి కలిశానన్నారు. సల్లూ భాయ్‌కు రామ్ చరణ్ అంటే ఎంతో ప్రేమ ఉందన్నారు. సల్మాన్ ఇచ్చిన జాకెట్ ఇప్పటికీ చరణ్ దగ్గర భద్రంగా ఉందని చెప్పారు.
పవన్ కాదనేవాడు కాదు
‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ (Salman Khan) పాత్రలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారని పూరి చిరును అడిగారు. సల్మాన్ రోల్‌లో కల్యాణ్ యాక్ట్ చేసినా బాగుండేదని మెగాస్టార్ అన్నారు. తాను అడిగితే పవన్ కాదనే ఛాన్స్ లేదన్నారు. అయితే ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ ఉండటంతో సల్లూ భాయ్‌ను తీసుకున్నామని చిరు వివరించారు.
‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ఆరో ప్రాణమని పూరీతో ఇంటర్వ్యూలో చిరు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం బ్యాగ్రౌండ్ ఆధారంగా సాగుతుందని. దాన్ని తమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడన్నారు. ఇక, భవిష్యత్తులో తన నుంచి రాబోయే సినిమాల్లో మంచి కామెడీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నారు చిరు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలు అందరి ఊహకు మించి ఉంటాయన్నారు.
ఫెయిలైతే ఫూల్‌లా చూస్తారు
ఈ ఇంటర్వ్యూలో పూరీని చిరంజీవి కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. అనుకున్న ఫలితం రాకపోతే ఏం చేస్తారని పూరీని చిరు ప్రశ్నించారు. దానికి పూరి స్పందిస్తూ.. ‘సక్సెస్ వస్తే పొగుడుతారు. ఫెయిల్యూర్ వస్తే ఫూల్‌లా చూస్తారు. ఇది సహజం. పరాజయం పలకరిస్తే ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. అలా అని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోలేను. ఏం పోగొట్టుకున్నా ఆ బాధలో నుంచి నెలలోనే కోలుకుంటా. ‘లైగర్’ (Liger) సినిమా ఫెయిలైనా దాంతో చేసిన జర్నీని ఎంజాయ్ చేశా’ అని చెప్పుకొచ్చారు. ఇక, తనతో తెరకెక్కిస్తానన్న ‘ఆటోజానీ’ ప్రాజెక్టును ఏం చేశారంటూ పూరీని చిరు అడిగారు. దీనికి.. ‘అది పాత కథ. ఇప్పుడు మీ కోసం అంతకంటే మంచి కథ రాస్తా. త్వరలోనే మిమ్మల్ని కలసి వినిపిస్తా’ అని పూరి బదులిచ్చారు.
Read more: నేను చిరంజీవి (Chiranjeevi Konidela)కే అభిమానిని.. ఆయన సినిమాలకు కాదు: ఆర్జీవీ (Ram Gopal Varma)
Follow Us