నాలుగు సంవత్సరాల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) థియేటర్‌లో సందడి చేశాడు. ఆయన నటించిన 'విక్రమ్' సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్ పలు కీలక కామెంట్లు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' సినిమాపై కూడా కమల్ హాసన్ స్పందించాడు. ఆయన మాటల్లోనే..
‘భారతీయుడు–2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తెస్తాం. కరోనా, సెట్‌లో ప్రమాదం రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా షూటింగ్‌ను కొనసాగించాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో చర్చించాం. వాళ్లు కూడా భారతీయుడు–2 సినిమాను త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
మరో 40 శాతం మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే దానిని కూడా పూర్తి చేస్తాం. ఒక సినిమాపైనే పది సంవత్సరాలు పనిచేయలేం. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకు ఒక నిర్మాణ సంస్థ ఉంది. అదే విధంగా దర్శకుడు శంకర్‌కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండూ కూడా చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటినీ మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి’ అని కమల్ హాసన్ చెప్పాడు.
ఇక, విక్రమ్ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య గెస్ట్ రోల్‌లో కనిపించాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా కమల్ హాసన్ (Kamal Haasan) సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్ బ్యానర్లలో తెరకెక్కించింది. మే 31న జరిగిన విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హాజరయ్యాడు.
Read More: 'Vikram' Review (విక్రమ్ రివ్యూ) : అడవిలో వెలుగు .. నిర్ణయించేది ప్రకృతి కాదు : కమల్ హాసన్
Follow Us