Most Searched Movies in Google : 2022లో విడుదలైన ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన భారతీయ సినిమాలను గూగుల్ ఇండియా (Google India) ప్రకటించింది. గూగుల్ ఇండియాలో అత్యధిక సార్లు వెతికిన సినిమాలలో బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర' మొదటి స్థానంలో ఉంది. టాప్ 10 చిత్రాలలో నాలుగు హిందీ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. రెండు సినిమాలతో ఆ తరువాతి స్థానంలో తెలుగు, కన్నడ సినిమాలు ఉన్నాయి. ఓ తమిళ సినిమాతో పాటు ఇంగ్లీష్ సినిమా కూడా గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. 2022కు సంబంధించి గూగుల్ ఇండియాలో ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన సినిమాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..
1. బ్రహ్మాస్త్ర : మొదటి భాగం - శివ
2022లో అత్యధికంగా గూగుల్ ఇండియాలో సెర్చ్ చేసిన సినిమాల్లో 'బ్రహ్మాస్త్ర' మొదటి స్థానంలో నిలిచింది.బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదలైంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ రూ. 350 కోట్లతో నిర్మించారు.
'బ్రహ్మాస్త్ర' సినిమాల్లో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, నాగార్జున, మౌనిరాయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. అస్త్రాలపై రూపొందించిన 'బ్రహ్మాస్త్ర' రూ. 431 కోట్లు వసూళ్లు చేసింది.
2. కేజీఎఫ్ చాప్టర్ 2
'కేజీఎఫ్ చాప్టర్ 1' చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం గూగుల్ ఇండియా సెర్చింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. బంగారపు గనులపై చిత్రీకరించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో కన్నడ హీరో యశ్ అద్భుతంగా నటించారు. యశ్ స్టైలిష్ లుక్, డైలాగులు థియేటర్లలో పేలాయి.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి, యశ్‌ల కెమిస్ట్రీ వెండితెరపై వినోదం పంచింది. 'కేజీఎఫ్ చాప్టర్ 2' లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా తన ఉగ్ర రూపం చూపించారు. ఈ సినిమా గురించిన విశేషాలను నెటీజన్లు తరచూ గూగుల్‌ను అడిగి తెలుసుకున్నారు.
3. ది కశ్మీర్ ఫైల్స్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. దేశ విభజన తరువాత కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.
అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. 2022లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల్లో 'ది కశ్మీర్ ఫైల్స్' మూడో స్థానంలో నిలిచింది.
4. ఆర్ఆర్ఆర్
'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) (RRR) సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి యాక్షన్ ఎంటర్‌టైన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీముడిగా ఎన్టీఆర్ నటించారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు దేశం కోసం పోరాటం చేసే పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
గూగుల్ ఇండియాలో ఎక్కువ సార్లు వెతికిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నాల్గవ స్థానంలో నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా రూ.1135 కోట్లను వసూళ్లు చేసింది. అంతేకాదు వంద రోజులకు పైగా ఆర్ఆర్ఆర్ థియేటర్లలో ప్రదర్శితమైంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' జపాన్ థియేటర్లను షేక్ చేస్తోంది.
బాలీవుడ్ నటి అలియా భట్, శ్రియా. అజయ్ దేవగణ్,పి సముద్రఖని, రే స్టీవెన్సన్, ఓలివియా మోరీస్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని నిర్మాత డి వి వి దానయ్య నిర్మించగా... ర ాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను రాశారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.
5. కాంతార
పంజర్లీ దైవంపై తీసిన గొప్ప సినిమా 'కాంతార'. ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి సాహసమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివాసీల సంప్రదాయాలు, పింజర్లీ దేవత గురించిన విశేషాలను అందరికీ తెలిసేలా చేసిన చిత్రం 'కాంతార'. ఈ సినిమా గూగుల్ ఇండియాలో ఎక్కువ సార్లు వెతికిన జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.
6. పుష్ప - ది రైజ్
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప -ది రైజ్' (Pushpa - The Rise). ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సినిమా విడుదలకు ముందే ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి. తగ్గేదేలే అంటూ పుష్పరాజుగా అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అందరికి ఆకట్టుకుంది. గూగుల్ ఇండియాలో 'పుష్ప' సినిమా విశేషాల కోసం నెటీజన్లు తెగ సెర్చ్ చేశారట. ఈ సినిమా గూగుల్ సెర్చ్ జాబితాలో టాప్ 6గా నిలిచింది.
7. విక్రమ్
విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' తమిళ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌కు జై కొట్టారు. 'విక్రమ్' సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్యలు విక్రమ్ చిత్రంలో తమ నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమా టాప్ 7 వ స్థానంలో చోటు సంపాదించుకుంది.
8. లాల్ సింగ్ చద్దా
'ఫారెస్ట్ గంప్' అనే ఇంగ్లీష్ సినిమా ఆధారంగా 'లాల్ సింగ్ చద్దా' సినిమాను తెరకెక్కించారు. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా గూగుల్ ఇండియాలో సెర్చ్ చేసిన సినిమా జాబితాలో 8 వ స్థానంలో ఉంది.
9. దృశ్యం 2
2022లో విడుదలైన హిందీ సినిమా 'దృశ్యం 2' గూగుల్ విడుదల చేసిన జాబితాలో 9 వ స్థానంలో ఉంది. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలలో దృశ్యం 2 బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ ఖన్నా, శ్రియా, టబు ముఖ్య పాత్రల్లో నటించారు. 'దృశ్యం 2' చిత్రాన్ని రూ .50 కోట్లతో నిర్మిస్తే...బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 285 కోట్లను వసూళ్లు చేసింది.
10. థోర్ - లవ్ అండ్ థండర్
హాలీవుడ్ దర్శకుడు తైకా వెయిటీటీ తెరకెక్కించిన సినిమా 'థోర్ - లవ్ అండ్ థండర్'. ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్, రస్సెల్ క్రోవ్, టెస్సా థాంప్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'థోర్ - లవ్ అండ్ థండర్' చిత్రాన్ని దాదాపు 250 మిలియన్ డాలర్లతో నిర్మించారు. ఈ సినిమా 760 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. ఈ చిత్రం భారత్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసిన సినిమాల్లో టాప్ 10 స్థానంలో నిలిచింది.
Read More: ఐఎండీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!
Follow Us