వయసు 62 .. ఇండస్ట్రీ @ 50 .. అన్‌స్టాపబుల్‌ : నేడు నందమూరి బాలకృష్ణ (BalaKrishna) పుట్టినరోజు !

నందమూరి బాలకృష్ణ (BalaKrishna)

నందమూరి తారకరామారావు నట వారసుడిగా తెరంగేట్రం చేసి, తండ్రికి తగ్గ తనయుడిగా రాణించిన దిట్ట నటసింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna).

తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 106 చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాడు.

కోట్ల మంది అభిమానుల గుండెల్లో 'బాలయ్య బాబు'గా నిలిచిపోయిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు (శుక్రవారం). ఈ సందర్భంగా ఆయన జీవితం, సినీ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..

1960, జూన్‌ 10న ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు ఆరవ కొడుకుగా చెన్నైలో జన్మించాడు బాలకృష్ణ. చిన్నతనం నుండి బాలకృష్ణ అంటే తారకరామారావుకు అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే బాలయ్యను గొప్ప నటుడిగా తీర్చిదిద్దాలని భావించేవారాయన.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే నటుడిగా మారాడు బాలకృష్ణ. స్వయంగా ఎన్టీఆర్‌ ‘నా నటనకు వారసుడు బాలకృష్ణ’ అని ప్రకటించారంటే బాలయ్యపైనా.. ఆయన నటనపైనా ఎన్టీఆర్‌‌కు ఉన్న నమ్మకం అటువంటిదని తెలుస్తోంది.

‘తాతమ్మ కల’తో అరంగేట్రం..

1974 లో ‘తాతమ్మ కల’ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యాడు బాలకృష్ణ (Balakrishna). ఈ సినిమాకు రామారావు దర్శకత్వం వహించారు. అలా తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా చేశాడు బాలయ్య. పద్నాలుగేళ్ల వయసులో నటుడిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌  సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు.

బాలనటుడిగా చేసిన అన్ని పాత్రల్లోనూ శభాష్‌ అనిపించుకున్న బాలయ్య. 1984లో భారతి- వాసు దర్శకత్వంలో రూపొందిన ‘సాహసమే జీవితం’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘డిస్కో కింగ్‌', ‘జననీ జన్మభూమి’ సినిమాలు చేసినా ‘మంగమ్మ గారి మనవడు’ తో హీరోగా స్టార్‌ డమ్‌ అందుకున్నాడు.

’కథానాయకుడు’, ‘శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలయ్య.

తండ్రికి తమ్ముడిగా..

‘అన్నదమ్ముల అనుబంధం’, ‘రౌడీ రాముడు’, ‘కొంటె కృష్ణుడు’ సినిమాల్లో ఎన్టీఆర్‌కు తమ్ముడి పాత్రలో నటించాడు బాలయ్య. తండ్రికి తమ్ముడిగా బాలకృష్ణ నటించిన తీరు, అప్పట్లోనే ప్రేక్షకుల్ని మెప్పించింది. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో అభిమన్యుడిగా నటించి ప్రశంసలు అందుకున్నాడు బాలయ్య. అంతేకాదు ‘సామ్రాట్‌ అశోక్‌' సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. 

పాపులర్‌ చిత్రాలు..

1991 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన ‘ఆదిత్య 369‘.. తెలుగు సినీ చరిత్రలో ఓ గొప్ప సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచిపోతుంది. అలాగే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ వంటి సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ అందుకున్నాడు బాలకృష్ణ.

ఇక బాలకృష్ణ  నటనా వైదుష్యాన్ని చాటిన సినిమాలు చాలానే ఉన్నాయి.  ‘దొంగరాముడు’, ‘రాముడు భీముడు’, ‘రక్తాభిషేకం’, ‘ముద్దుల మావయ్య’, ‘అశోక చక్రవర్తి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌', ‘బంగారు బుల్లోడు’ లాంటి సినిమాల ద్వారా ఆయన మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

అలాగే ‘భైరవ ద్వీపం’ సినిమా ఆ రోజులలోనే ట్రెండ్ సెట్టర్. జానపద చిత్రాలు కనుమరుగవుతున్న రోజులలోనే ఆయన ఆ ప్రయోగం చేశారు. ఇక   ‘బొబ్బిలి సింహం’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీనరసింహ’, ‘పాండురంగడు’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘లెజెండ్‌'  లాంటి సినిమాలు బాలయ్య అమోఘమైన నటనకు తార్కాణాలు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన ‘మనుషులంతా ఒక్కటే’, ‘బొబ్బిలిపులి’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘పరమవీరచక్ర’ లాంటి చిత్రాలు అన్ని కూడా ఏదో ఒక సామాజిక అంశానికి అద్దంపట్టే చిత్రాలే.

 ఇలా జానపద, పౌరాణిక, సోషల్‌, కమర్షియల్‌, ఫ్యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలయ్య. 

నాన్నగారే గురువు..దైవం..

‘నాపై నాన్న ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఆయనే నాకు గురువు, దైవం, మార్గ దర్శకులు. క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నాను. సెట్‌లో నాన్న, నేను ఉంటే యూనిట్‌ అందరికీ హడల్‌. ఆయన సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు, డైలాగులు చెప్తున్నప్పుడు భీకర వాతావరణం ఉంటుంది. మొదట ఆ వాతావరణాన్ని చూసి కంగారు పడ్డాను. తర్వాత అలవాటైంది. ఆయనలోని గంభీరత్వాన్ని పట్టేశాను. ప్రేక్షకుల్లోనూ, అభిమానుల గుండెల్లోనూ బాలకృష్ణ నిలిచిపోయాడంటే.. అదంతా నాన్నగారి స్ఫూర్తే’ అంటూ తన జీవితంపై తండ్రి ఎన్టీఆర్‌ ప్రభావం గురించి చెబుతుంటాడు బాలకృష్ణ. 

ఫ్యాక్షన్‌ సినిమాలకు నాంది..

తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షన్‌ సినిమాల్లో నటించి భారీ విజయాలు అందుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే. అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆ దిశగా ముందుగా అడుగు వేసింది కూడా ఆయనే. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్‌ కొట్టి.. తెలుగునాట ఫ్యాక్షన్‌ సినిమా ట్రెండ్‌కి నాంది పలికిన నటసింహం.. 'నరసింహనాయుడు' సినిమాతో మరోసారి భారీ హిట్‌ కొట్టి బాక్సాఫీస్‌ బొనాంజా సృష్టించాడు.

'లక్ష్మీనరసింహ'తో పోలీస్‌ పవర్‌ను చూపించి కలెక్షన్స్‌ కొల్లగొట్టిన బాలయ్య.. ‘సింహా’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సింహనాదం చేశాడు. భవిష్యత్తులో చెంఘిజ్‌ ఖాన్‌ లాంటి పాత్రలు చేయాలన్నది బాలయ్య డ్రీమ్‌. చెంఘిజ్‌ ఖాన్‌పై హాలీవుడ్‌లో కూడా సినిమా వచ్చింది. 

అమ్మని చూసినట్టే అనిపిస్తుంది..

‘నేను లెక్కల్లో వీక్‌. ఇంట్లో వ్యవహారాలన్నీ వసుంధరే చూసుకుంటుంది. ఆమెకు ఓర్పు కూడా ఎక్కువే. ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడంతోపాటు పిల్లల ఆటాపాటా, సరదాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. నాకేదైనా సమస్య వస్తే పరిష్కరించేందుకు తపిస్తుంది. ఒక్కోసారి తనని చూస్తుంటే మా అమ్మ బసవతారకమ్మను చూసినట్టే అనిపిస్తుంది’ అని ఓ సందర్భంలో తన భార్య వసుంధర గురించి గొప్పగా చెప్పాడు బాలయ్య.

 

అవార్డులు..

2001లో వచ్చిన ’నరసింహనాయుడు’, 2010లో వచ్చిన ’సింహా’ చిత్రాలకుగాను నంది అవార్డులను అందుకున్నాడు బాలయ్య. 100వ చిత్రంగా బాలయ్య ’గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో నటించి. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యుద్ధవీరుడుగా బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందంటూ అభిమానులు మురిసిపోయారు.

పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తత్వం బాలయ్యకు మొదటి సినిమా నుంచే ఉంది. అదే ఈనాడు ఆయనను మాస్‌ హీరోగా సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలబెట్టింది. నటుడిగా బాలయ్య ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. నిర్మాతగా NBK ఫిలిమ్స్‌ బ్యానర్‌ స్థాపించి ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’,‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ సినిమాలు నిర్మించాడు. అరవై రెండేళ్ల జీవితం.. 50 ఏళ్లకు చేరువైన సినీ ప్రయాణం.. 107 చిత్రాలతో ఆయన పయనం అఖండంగా దూసుకుపోతోంది.

రాబోయే సినిమాలు..

బాలయ్య ఈ సంక్రాంతికి మరో కొత్త సినిమాకి సైన్ చేశారు. ‘క్రాక్‌' మూవీతో బ్లాక్‌ బస్టర్‌ ఖాతాలో వేసుకున్న గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సింహం బ్యాక్‌ డ్రాప్‌తో ఉన్న పోస్టర్‌ మీద 'హంట్‌ స్టార్ట్స్‌ సూన్‌' అని మెన్షన్‌ చేసిన ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకులకు యాక్షన్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.దర్శకుడు అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ తదుపరి సినిమా ఖరారైంది.

అన్‌స్టాపబుల్‌.. బాలకృష్ణ

సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ NBK’ షోతో యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి అదుర్స్‌ అనిపించుకున్నాడు. బాలయ్య టాక్‌ షో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వారంతా షాక్‌ అయ్యేలా షోని టాప్‌ షోగా నిలిపాడు నందమూరి నటసింహం.

Read More: బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్‌పై ఉత్కంఠ.. రేపు ప్రకటించే చాన్స్ !

నవ్వుతూ.. నవ్విస్తూ.. తన నటనతో అందరినీ అలరిస్తూ.. మంచితనానికి, క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచిన బాలయ్యకు
‘పింక్‌విల్లా’ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
You May Also Like These