బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన ప్రియుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారే (Nupur Shikhare)తో ఆమె పెళ్లి జరగనుంది. వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం ముంబైలో వేడుకగా జరిగింది. ఆమిర్ ఖాన్, ఐరా ఖాన్ తల్లి రీనా దత్తా, కిరణ్ రావు, ఫాతిమా సనా షేక్, ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిశ్చితార్థ వేడుకలో ఐరా ఖాన్ (Ira Khan) ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయారు. నుపుర్ నలుపు రంగు సూట్‌లో కనిపించారు. ఇక, ఆమిర్ ఖాన్ కాబోయే అల్లుడు నుపుర్ శిఖరే గతంలో ఆయనకు శిక్షణ ఇచ్చారు. ఆమిర్ తర్వాత ఐరాకు నుపుర్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ దగ్గరయ్యారని తెలుస్తోంది. 2021 వాలెంటైన్స్ వీక్‌లో నుపుర్, ఐరాలు ఇద్దరూ పాల్గొన్నారు. తద్వారా తమ బంధాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు.
ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఐరా.. ప్రియుడి విషయంలోనూ ఓపెన్‌గానే వ్యవహరించారు. నుపుర్‌తో కలసి దిగిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ హల్‌చల్ చేశారు. కాగా, గతంలో మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలం ఐరా రిలేషన్‌లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయనపై ఉన్న ప్రేమను ఆమె సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. అయితే మిషాల్–ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో ఆయనకు బ్రేకప్ చెప్పి.. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేతో ఆమె ప్రేమాయణం నడిపించారని తెలిసింది.
ఇకపోతే, సినిమాల నుంచి కొన్నాళ్లు విరామం తీసుకోవాలని ఆమిర్ ఖాన్ నిర్ణయించుకున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) ఫ్లాప్ తర్వాత చాన్నాళ్లకు ఇటీవల మీడియా ముందుకు వచ్చారు ఆమిర్. ఆయన కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. నటనకు కొంతకాలం విరామం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ‘నేను నటించడం మొదలుపెట్టి 35 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని అనిపిస్తోంది. అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నా. మా అమ్మ, పిల్లలతో గడపాలనుకుంటున్నా. ఇన్నేళ్లు నిరంతరం పని గురించే ఆలోచించా. అది సరైనది కాదనిపిస్తోంది. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదని అనుకుంటున్నా’ అంటూ అనూహ్య నిర్ణయాన్ని ఆమిర్ ప్రకటించారు.
Read more: Aditya 999: వచ్చే ఏడాది ‘ఆదిత్య 999’ ఉంటుంది’: ‘దాస్ కా ధమ్కీ’ ఈవెంట్‌లో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్
Follow Us