టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుంటూ.. అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). తెలుగు చిత్ర పరిశ్రమలోకి 'పటాస్' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినోదానికి పెద్ద పీట వేస్తూ కమర్షియల్ హిట్లు అందుకుంటున్నాడు. 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'F2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్ 3' వంటి డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఈ డైరెక్టర్ ఖాతాలో ఉన్నాయి.
అనిల్ రావిపూడి సినిమాల్లో యాక్షన్‌తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. అయితే అతి త్వరలో నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) మూవీ కోసం రెడీ అవుతున్నారు అనిల్ రావిపూడి. #NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చనున్నారు.
ఇందులో బాలకృష్ణను ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో చూపబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. 'వీర సింహా రెడ్డి' సినిమా పూర్తైన తరవాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తొలిసారిగా ప్రముఖ ఓటీటీ మాధ్యమం 'ఆహా' (Aha OTT) ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అసలు విషయంలోకి వెళితే.. తెలుగు ఓటీటీగా ఎంతో మంచి గుర్తింపు పొందిన 'ఆహా' ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
ఈ క్రమంలోనే ఆహా.. 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' (Comedy Stock Exchange) పేరుతో ఓ కామెడీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓటీటీలో ప్రేక్షకులతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని 'ఆహా' అధికారకంగా వెల్లడించింది.
'అయ్యోరు వచ్చినారు.. తెలుగు సినిమాలో కామెడీ డెఫినిషన్, డెస్టినేషన్ రెండూ మార్చిన మన అనిల్ రావిపూడి గారు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారహో' అంటూ ఆహా టీమ్ 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' ప్రోగ్రామ్‌ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్ 'ఐ' అని పేర్కొంటూ అనిల్ రావిపూడికి సంబంధించిన పోస్టర్‌ని (Anil Ravipudi Poster) ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), ముక్కు అవినాష్, వేణు, హరి, బుల్లెట్ భాస్కర్, సద్దాం, యాదమ్మ రాజు వంటి పలువురు కమెడియన్లు ప్రేక్షకులతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read More: Tamannaah Bhatia: F3 షూటింగ్ లో అనిల్ రావిపూడి-తమన్నా మధ్య గొడవ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Follow Us