Zee Saregamapa : ఫినాలేలో సత్తా చాటిన సింగింగ్ స్టార్స్.. విజేతగా శృతిక సముద్రాల, రన్నరప్‌గా వెంకట్ సుధాన్షు

Zee Saregamapa Singing Superstar : ఫినాలేలో పోటాపోటీగా, రసవత్తరంగా సాగిన పాటల యుద్ధం

ఇరవై ఆరు వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. 

ఫినాలేలో తనదైన అమోఘమైన ప్రదర్శనతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలవగా, తనకు గట్టి పోటీ ఇచ్చిన వెంకట్ సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. 

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ ఫినాలేలో ట్రోఫీతో పాటు, లక్ష రూపాయల నగదు బహుమతిని న్యాయనిర్ణేతలు శృతికకు ప్రదానం చేశారు. అలాగే మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమతిగా అందించారు.ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు (Venkat Sudhanshu) 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.    

ఆదివారం అనగా ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్‌లో లెజెండరీ సింగర్ పి సుశీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్లు శృతి హాసన్, నితిన్, క్రితి శెట్టిల సమక్షంలో జరిగిన ఈ ఫినాలే ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసింది. 8 మంది ఫైనలిస్టులు తమదైన స్టైల్‌లో పాటలను పాడి ఆహుతులను ఎంతగానో అలరించారు. జీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు కోటి, గాయనీమణి ఎస్పీ శైలజ, సింగర్ స్మిత, గేయ రచయిత అనంత్ శ్రీరామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 

ఈ ఫినాలే వేదికగా సంగీత ప్రపంచానికి ప్రముఖ గాయని సుశీల చేసిన సేవలను గుర్తిస్తూ చేసిన ఘన సన్మానం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించిన తీరు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కదిలించింది. 

 

'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలేలో న్యాయనిర్ణేతలను మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక సముద్రాల (Shruthika Samudhrala), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేయడం విశేషం. 

ఆరు సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేకంగా శిక్షణను తీసుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా, ఆమె మాట్లాడుతూ "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ గెలవడంతో నా కలలన్నీ నిజమైనట్లేనని భావిస్తాను. ఇది నా లైఫ్‌లోనే బెస్ట్ మూమెంట్. ఈ  పయనాన్ని ఎప్పటికి నేను మర్చిపోలేను. 

అలాగే ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. వారికి కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీలో వారు నాకు ఎంతో సహకారం అందించారు. వారి దగ్గర నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. 

అదేవిధంగా, ఈ జర్నీలో నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన జీ సరిగమప టీం సభ్యులకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా మెంటర్స్, న్యాయ నిర్ణేతలు, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా, నేను సింగర్‌గా ఎదగడం కోసం నాన్న శశికాంత్, అమ్మ రూప మరియు అక్క శరణ్య అందించిన ప్రోత్సాహం, ఆత్మస్థైర్యం నేను ఎప్పటికి మరువలేను. 

అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ టైటిల్ విజేత శృతిక తన భావాలను మీడియాతో పంచుకున్నారు.    

Read More:  జీ తెలుగు ప్రీమియర్ లీగ్ (Zee Telugu Premier League): టీవీ స్టార్స్‌తో.. క్రికెట్ సమరం

You May Also Like These