మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ త్యాగానికి నివాళిగా హీరో అడవి శేష్ (Adivi Sesh)..'మేజర్' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం 'మేజర్' పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకెళుతోంది. మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తూ అమెరికాలోనూ అదరగొడుతుంది. 'మేజర్' నాలుగు రోజుల్లో రూ. 40.36 కోట్లను వసూలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటికి దాదాపు 2 మిలియన్లు అంటే.. 20 లక్షల మంది 'మేజర్' సినిమాను చూశారట.
'మేజర్' సినిమా చాలా భిన్నమైనది : అడవి శేష్
మేజర్ (Major) సినిమాపై అడవి శేష్ ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ అందిస్తున్నారు. 'మేజర్' కలెక్షన్ల వివరాలను కూడా ట్విటర్ ద్వారా అడవి శేష్ నిత్యం పోస్ట్ చేస్తున్నారు. అయితే 'మేజర్' కలెక్షన్ వివరాలను ఎందుకు సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేస్తున్నారని పలువురు అభిమానులు అడిగారట. దానిపై కూడా ఆయన స్పందించారు.
అడివి శేష్ మాట్లాడుతూ 'మేజర్' వేరే సినిమాల కంటే చాలా భిన్నమైనదన్నారు. 'మేజర్' సినిమాను ఇప్పటివరకు 20 లక్షల మంది చూశారని తెలిపారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌పై అభిమానంతో, ప్రజలు 'మేజర్' సినిమా చూస్తున్నారని ఆయన వివరించారు. 'మేజర్' ఒక అద్భుతమైన సినిమా కాబట్టే, దాని గురించిన వివరాలను అందరికీ తెలుపుతున్నానని ఆయన ఓ పోస్టులో తెలిపారు. ఈ సందర్భంగా 'ఇండియా లవ్స్ మేజర్' అంటూ అడవి శేష్ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు.
భారతీయ సినిమా చరిత్రలో 'మేజర్' నిలిచిపోనుంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణ త్యాగం చేసి ప్రజలను కాపాడిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమా తెరకెక్కింది. 31 ఏళ్లకే ఆర్మీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన సందీప్ ఉన్నికృష్ణన్ భారతదేశం గర్వించదగ్గ సైనికుడిగా చరిత్ర పుటల్లో నిలిచారు.
14 మంది అమాయకులను ఉగ్రమూకల దాడి నుంచి కాపాడుతూ, చావుకు ఎదురెళ్లి మరీ రక్షించారు. 'మేజర్' త్యాగంతో పాటు.. అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా.. ఈ సినిమాను శశి కిరణ్ తిక్క అద్భుతంగా తెరకెక్కించారు. టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు 'మేజర్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
తెలుగు రాష్ట్రాల్లో 'మేజర్' కలెక్షన్
మేజర్ (Major) తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ రాబట్టింది. తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ కాస్త నత్తనడకనే సాగింది. అయితే, రోజు రోజుకు 'మేజర్' లాభాల బాటలోనే కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 4.07 కోట్లు, రెండో రోజు రూ.3.61 కోట్లు, మూడో రోజు రూ. 3.57 కోట్లు.. నాల్గవ రోజు రూ. 1.34 కోట్లను ఈ సినిమా వసూళ్లు చేసింది. మొత్తం నాలుగు రోజుల కలెక్షన్ చూస్తే.. రూ. 12.59 కోట్లను షేర్‌గా రాబట్టింది. అలాగే గ్రాస్ రూపంలో రూ.21.59 కోట్లను రాబట్టింది.
'మేజర్' కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే చేకూర్చాయని చెప్పాలి. తక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి, తమకు 'మేజర్' ఎక్కువ లాభాలనే తెచ్చిపెడుతుందంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. చిత్ర యూనిట్ కూడా మేజర్ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. నిర్మాాతలు కూడా, సినిమా రేట్లు తగ్గించి మరీ మేజర్ సినిమాను వివిధ ప్రాంతాలలో రిలీజ్ చేశారు. భారతీయులు గర్వించదగ్గ సినిమాగా 'మేజర్' కొత్త రికార్డులను నెలకొల్పుతుందని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.
Read More: దేశాన్ని ప్రేమించడం అందరి పని, వారిని కాపాడటం సోల్జర్ పని : అడివి శేష్
Follow Us