బ్రహ్మాస్త్ర (Brahmastra) గురించి టాప్ 10 ఆసక్తికర పాయింట్స్.. రణ్‌బీర్ కపూర్ పాత్ర ఎవరిని పోలి ఉంటుందో తెలుసా

బ్రహ్మాస్త్ర (Brahmastra) చిత్రంలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

బ్రహ్మాస్త్ర (Brahmastra) .. ఇప్పుడు ఎవరిని అడిగినా ఈ సినిమా గురించే చర్చ. ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అలాగే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇదే క్రమంలో హీరో రణ్‌బీర్ కపూర్‌ని పొగిడారు. 

ఆయన యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర (Brahmastra) చిత్రం 'బ్రహ్మాస్త్రం' పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు మీకోసం 

దర్శకుడి గురించి

బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమాకి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ గతంలో స్వదేశ్, వేక్ అప్ సిడ్, ఏ జవానీ హై దివానీ లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిత్రమేంటంటే, అయాన్ తాతయ్య శశధర్ ముఖర్జీ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 

బంధన్, పేయింగ్ గెస్ట్, లవ్ ఇన్ సిమ్లా, లీడర్, తుమ్సా నహా దేఖా లాంటి చిత్రాలు అందులో ప్రముఖమైనవి. మరో విషయం ఏమిటంటే, అయాన్‌కి బాలీవుడ్ కథానాయికలు కాజోల్, రాణీ ముఖర్జీ కజిన్స్ అవుతారు.  

మూడు భాగాలుగా బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగాన్ని 'శివ' పేరుతో దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక, మరో రెండు భాగాలకు ఆయన దర్శకత్వం వహిస్తారు.

 

భారీ బడ్జెట్ సినిమా

బ్రహ్మాస్త్ర (Brahmastra) సినిమాని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.410 కోట్ల రూపాయలను ఈ సినిమా కోసం నిర్మాతలు వెచ్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, 2.0 చిత్రాల తర్వాత భారతదేశంలో అత్యధిక మొత్తాన్ని వెచ్చించి నిర్మిస్తున్న మూడవ చిత్రమే ఈ 'బ్రహ్మాస్త్రం'

ఆ పాత్రకు ఆధారం ఎవరో తెలుసా

బ్రహ్మాస్త్రం (Brahmastram) సినిమాలోని రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) పోషిస్తున్న శివ పాత్రకు ప్రేరణ ఎవరో తెలుసా ? పర్షియన్ కవి రూమీని పోలి ఉంటుందట ఈ పాత్ర. రూమీ కొటేషన్స్ నేడు జగద్విఖ్యాతం. వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో, షేర్ చాట్ సందేశాల రూపంలో అవి నేడు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌బీర్‌ ప్రేయసిగా అలియాభట్  నటించడం విశేషం. అలాగే షారుఖ్ ఖాన్ కూడా ఓ సైంటిస్టు పాత్రలో నటిస్తున్నారు. 

మూడు పాటలూ చంద్రబోసే రాశారు

బ్రహ్మాస్త్రం (Brahmastram) తెలుగు వెర్షన్‌లో గల మూడు పాటలు కుంకుమాల, దేవదేవ, అల్లరి మోత.. వీటన్నింటినీ కూడా ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత చంద్రబోస్ రాశారు. అవే పాటలను హిందీలో అమితాబ్ భట్టచార్య, తమిళంలో మధు కార్కి, మలయాళంలో శబరీష్ వర్మ రాశారు. ఈ సినిమాకి ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు. 

టైటిల్‌ను ఎందుకు మార్చారు?

కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిసున్న ఈ చిత్రానికి తొలుత 'డ్రాగన్' అనే టైటిల్‌ను పెడదామని భావించారట. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని, భారతీయ ప్రాచీన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక శక్తిని గురించి తెలిపే చిత్రం కాబట్టి 'బ్రహ్మాస్తం' అనే టైటిల్‌ను నిర్దేశించారట.  

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేది హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

బ్రహ్మాస్త్రం (Brahmastram) సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించేది ఓ హాలీవుడ్ సంగీత దర్శకుడు కావడం విశేషం. గ్రాండ్ కాన్యాన్, ది బాడీ గార్డ్, వాల్కానో, టైటానిక్, స్కైఫాల్, అవతార్ లాంటి చిత్రాలకు పనిచేసిన సైమన్ ఫ్రాంగ్లిన్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం.

ప్రత్యేక పాత్రలో నాగార్జున

బ్రహ్మాస్త్రం (Brahmastram) చిత్రంలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అనీష్ అనే ఓ ఆర్టిస్టు రోల్‌లో ఆయన కనిపించనున్నారు. బ్రహ్మాంశంలోని నంది అస్త్రానికి ప్రతినిధిగా ఆయన పాత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చనుందని టాక్. ఇంతకీ బ్రహ్మాంశం అంటే ఏమిటి అనుకుంటున్నారా? అది దేవాస్త్రాలను పరిరక్షించే ఓ కూటమి (గ్రూప్). ఆ కూటమిలో ఒక్కో అస్త్రానికి ఒక్కో వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఈ కూటమికి నాయకుడిగా, ప్రభాస్త్రానికి ప్రతినిధిగా అమితాబ్ బచ్చన్ నటించడం విశేషం.

చీకటి రాజ్యపు రారాణిగా మౌనిరాయ్

క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, నాగిని, జునూన్ లాంటి సీరియల్స్‌లోని తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మౌని రాయ్ బ్రహ్మాస్త్రం చిత్రంలోని చీకటి రాజ్యపు రారాణి పాత్రలో నటించడం గమనార్హం. కేజీఎఫ్ చిత్రంలోని ఓ ఐటం సాంగ్‌లో నటించాక, మౌని రాయ్ దక్షిణాది ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలైంది.

చిరంజీవి వాయిస్ ఓవర్.. ఎన్టీఆర్ ముఖ్య అతిథి

మెగాస్టార్ చిరంజీవి 'బ్రహ్మాస్త్రం' (Brahmastram) సినిమా తెలుగు వెర్షన్‌‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరై, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో టాలీవుడ్‌లో కూడా ఈ సినిమాకి భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. 

ఇవండీ.. బ్రహ్మాస్త్రం సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే, వేచి చూడాల్సిందే !

Read More: 'బ్ర‌హ్మాస్త్రం' స‌రికొత్త రికార్డుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.. షాక్‌లో బాలీవుడ్

Credits: Instagram
You May Also Like These