డబ్బింగ్ సినిమాలను ఆపలేం.. తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్‌ బాబు (Suresh Babu) కామెంట్స్

మంచి సినిమా అయితే ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారని.. సినిమా బాగోకపోతే తర్వాతి రోజే తీసేస్తారని నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) అన్నారు

టాలీవుడ్‌లో తెలుగు, తమిళ సినిమాల విడుదలపై గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. సంక్రాంతి, దసరా లాంటి పండుగ సీజన్లలో తెలుగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి (టీఎఫ్‌సీసీ) లేఖ విడుదల చేసిన విషయం విదితమే. ‘వరిసు’ సినిమా విడుదల విషయంలో ఏర్పడిన ఈ వివాదం ఇంకా కొలిక్కి రావడం లేదు. దీనిపై తమిళ దర్శక నిర్మాతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తెలుగు నాట తమిళ సినిమాలను అడ్డుకుంటే.. తమిళనాడులో తెలుగు చిత్రాలను రిలీజ్ కానివ్వబోమంటూ కొందరు కోలీవుడ్ డైరెక్టర్స్ హెచ్చరించారు. 

తాజాగా టీఎఫ్‌సీసీ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు ఆడతాయన్నారు. తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయని.. మన సినిమాను ఏ భాషలోనూ చులకనగా చూడట్లేదనన్నారు. చెన్నైలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని సురేష్ బాబు (Suresh Babu) చెప్పుకొచ్చారు.  

‘ఏ చిత్ర పరిశ్రమలోనైనా స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తర్వాతి రోజే తీసేస్తారు. ఇదొక వ్యాపారం అంతే. ఇక్కడ ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న మూవీకి ఎక్కువ థియేటర్స్‌ ఇస్తారు. అది ఏ భాష సినిమా అనేది ఎవరూ చూడరు. మన తెలుగు సినిమాలు కూడా ఇతర భాషల్లో విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి’ అని సురేష్ బాబు పేర్కొన్నారు. 

కాగా, దసరా, సంక్రాంతి పండుగ రోజుల్లో తెలుగు చిత్రాల ప్రదర్శనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పలు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్​ కామర్స్ (Telugu Film Chamber of Commerce) ఇటీవల లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగుతోపాటు పలు తమిళ టాప్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ పైవిధంగా అసోసియేషన్లకు సూచించింది. 2017లో తీసుకున్న నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లకు గుర్తు చేసింది.

Read more: Biggboss Season6: ఈ వారం ఎలిమినేట్ అయిన ఇనయా సుల్తానా (Inaya Sulthana).. బిగ్ బాస్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

You May Also Like These