సక్సెస్ కూడా ఒక్కోసారి కిక్ ఇవ్వకపోవచ్చు. గెలిచినప్పుడు కంటే ఓటమి ఎదురైనప్పుడే కదా ఎవ్వరికైనా తామేంటో తెలుసుకునే అవకాశం వస్తుంది. గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అదే ఓటమి.. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది అనే ఓ సినిమా డైలాగ్ కూడా ఉంది. చిత్ర పరిశ్రమకు కూడా ఇది వర్తిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయాల్లో ఉన్న వారికే క్రేజ్ ఉంటుంది. పరాభవం ఎదురైతే ఇక్కడ పట్టించుకునే వారే ఉండరని అంటుంటారు. ఒక్కసారైనా ఓడిపోతేనే కదా ఇవన్నీ తెలిసొచ్చేది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఇదే అంటున్నారు. తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమేనని అంటున్నాడీ హీరో. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఇదే వర్తిస్తుందని విజయ్ చెబుతున్నారు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ (Liger) మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలైంది. దీంతో విజయ్ డీలా పడ్డాడని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఇలాంటి పెద్ద చిత్రాల్లో నటించడమే గొప్ప అవకాశమని విజయ్ చెప్పారు.
‘లైగర్’ మూవీలోని నత్తి పాత్రను నటిస్తున్నప్పుడు ఆస్వాదించానని రౌడీ స్టార్ అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కోసం దేశంలోని అన్ని ప్రాంతాలను చుట్టి రావడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ‘లైగర్ మూవీ కోసం ఎంత చేయాలో అంతా చేశా. కానీ మేం అనుకున్న ఫలితం రాలేదు. తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమని అర్థం. ఒకవేళ ఎవరైనా తప్పు చేయట్లేదంటే వాళ్లు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించట్లేదనే అర్థం’ అని విజయ్ పేర్కొన్నారు.
‘విజయం వచ్చినా, రాకున్నా ప్రయత్నాన్ని విరమించకూడదు. అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయంలోనూ ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉంటా. జీవితంలో జయాపజయాలు సహజం’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇకపోతే, విజయ్ ప్రస్తుతం ‘ఖుషీ’ (Kushi) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
Follow Us