‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లోకి మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన దర్శకుడు రితేష్ రానా.ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. తన రెండో ప్రయత్నంగా లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. సర్రియల్ వరల్డ్ (ఊహాజనిత ప్రపంచం)లో జరిగే కథగా తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథేంటంటే..
జిండియా అనే ఒక ఊహాజనిత దేశంలో జరిగే కాల్పనిక కథ. ఆ దేశ రక్షణ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్). దేశంలోని తుపాకీ చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని ప్రవేశపెడతాడు. దాని కారణంగా దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజలంతా నిత్యావసరాలు కొనుగోలు చేసినట్టుగా గన్స్ కొనేస్తుంటారు. హ్యాపీ (లావణ్యా త్రిపాఠి) తన బర్త్ డే పార్టీ కోసం రిట్జ్ హోటల్‌కు వెళుతుంది. అదే సమయంలో తాను దొంగిలించిన ఒక స్పెషల్ లైటర్‌ను హ్యాపీ హ్యండ్‌బ్యాగ్‌లో వేస్తాడు లక్కీ(నరేష్ అగస్త్య). అక్కడి నుంచి హ్యాపీ పోష్ పబ్‌కు వెళుతుంది. ఆ పబ్‌లో డ్రింక్‌లో మత్తుమందు కలిపి హ్యాపీని కిడ్నాప్ చేస్తాడు బేరర్. ఆ తర్వాత ఏం జరిగింది? హ్యాపీ బ్యాగ్‌లో వేసిన లైటర్ స్పెషాలిటీ ఏంటి? లైటర్‌తో రిత్విక్ సోధికి ఏంటి సంబంధం? అసలు ఈ కథలోకి రౌడీ (రాహుల్ రామకృష్ణ), మాక్స్ పెయిన్ (సత్య) క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయి? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా చూడాల్సిందే.
సర్రియల్ జానర్‌లో తెరకెక్కించిన కథ కావడంతో ఊహాజనితమైన జిండియా అనే కాల్పనిక ప్రపంచంలో కథను నడిపించారు దర్శకుడు. ఒక్కో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో కొత్త తుపాకీ చట్టాన్ని రిత్విక్ సోధి ప్రవేశపెట్టే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అనంతరం రిత్విక్ మీడియా ఇంటర్వ్యూ కామెడీగా ఉంటుంది. రిట్జ్ హోటల్‌లోని సీన్స్, పోష్ పబ్‌లో హ్యాపీ కిడ్నాప్ షాట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతాయి. క్యారెక్టర్లను పరిచయం చేస్తుండడంతోనే సినిమా ఫస్టాఫ్ ముగుస్తుంది.
కథ స్పీడ్‌గా ముందుకు కదులుతున్న సమయంలో క్యారెక్టర్లను పరిచయం చేయడంతో కొంత ఆసక్తి తగ్గుతుంది. అదే సమయంలో వచ్చే కొన్ని సీన్లు అలరిస్తాయి. సత్య కామెడీ బాగానే ఉన్నా.. గెటప్ శీను, రాకెట్ రాఘవ, హర్ష క్యారెక్టర్లు అంతగా పండలేదనే చెప్పాలి.
ఇంటర్వెల్‌కు ముందు హ్యాపీ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తిని ప్రేక్షకుల్లో మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యాపీకి రిత్విక్‌కు ఏం జరిగింది. రిత్విక్‌ను దెబ్బతీయడానికి హ్యాపీ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం మెప్పించలేదు. సినిమా మధ్యలో వచ్చే లక్కీ సిస్టర్ సెంటిమెంట్ సీన్లు బాగానే పండాయి. సినిమా క్లైమాక్స్ ముందుగా రిత్విక్ సోధి, మాక్స్ పెయిన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఆ సీన్లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. అయితే సినిమా కథను దర్శకుడు ముగించిన తీరుకు ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ఎవరెలా చేశారంటే: హ్యాపీ క్యారెక్టర్‌లో లావణ్య త్రిపాఠి బాగానే నటించారు. తన అందం, అభినయంతో మెప్పించడానికి కృషి చేశారు. కామెడీ టైమింగ్ కూడా బాగానే అనిపించింది. మూగసైగలతో నరేష్ అగస్త్య నటన ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య తమ పరిధిలో బాగానే నవ్వించారు. రాహుల్ రామకృష్ణ, గుండు సుదర్శన్, గెటప్ శ్రీను తమ క్యారెక్టర్లకు న్యాయం చేసినట్టే.
మత్తు వదలరా సినిమా తరహాలోనే ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమాను తెరకెక్కించిన తీరు దర్శకుడి ప్రతిభను మనకు తెలియజేస్తాయి. కథ బాగానే ఉన్నా దానిని ఆసక్తికరంగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. సినిమా ఫస్టాఫ్ బాగానే అనిపించినా.. సెకండాఫ్ బోర్ కొట్టిస్తుంది. కాలభైరవ అందించిన సంగీతం బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
సర్రియల్ వరల్డ్‌లో కథ
సినిమాను ప్రారంభించిన తీరు
వెన్నెల కిషోర్, సత్య కామెడీ
లావణ్యా త్రిపాఠి యాక్టింగ్
మైనస్ పాయింట్స్ :
కథను నడిపించే తీరులో క్లారిటీ లేకపోవడం
సెకండాఫ్‌లో బోర్ కొట్టేలా నడిపించిన తీరు
-ఓవరాల్‌గా.. ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలో తగ్గిన హ్యాపీనెస్
యాక్టర్స్: లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, సత్య
మ్యూజిక్ : కాల భైరవ;
దర్శకుడు : రితేష్ రానా
నిర్మాణం: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : 08/07/2022
రేటింగ్ : 2 / 5
Read More : Happy Birthday Trailer: వాడు ప్రొఫెషనల్ కిల్లర్ అయితే నేను పెయిన్ కిల్లర్.. 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ !
Follow Us