నేటి తరానికి నచ్చే సినిమాలను తెరకెక్కించడంలో దాసరి మారుతి (Maruthi) రూటే వేరు. ఈయన "ఈ రోజుల్లో " సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ, స్టార్ దర్శకుడిగా మారారు. "పక్కా కమర్షియల్ " సినిమాతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు. మారుతి పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి మీకోసం.
బొమ్మలు గీయడం సరదా
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దాసరి మారుతి (Maruthi) జన్మించారు. 1973 అక్టోబర్ 8న మారుతి పుట్టినరోజు. డిగ్రీ వరకు చదువుకున్న మారుతి.. తొలుత వాహనాల కోసం నంబర్ ప్లేట్స్, స్టిక్కర్లు తయారు చేసేవారు. ఆ తరువాత యానిమేషన్ కోర్సు నేర్చుకోవాలని హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ వచ్చాక, జూబ్లీహిల్స్‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో ఈయన టూడీ యానిమేషన్ కోర్స్ పూర్తి చేశారు.
మారుతికి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. భాగ్యనగరం రోడ్లపై చక్కర్లు కొడుతూ తనకు కనిపించే భవనాలను, కట్టడాలను బొమ్మలుగా గీసేవారు. అలాగే గోల్కొండ కోట, చార్మినార్, నెహ్రూ జూ పార్క్‌లోని జంతువులు, పక్షులను గమనిస్తూ, వాటి బొమ్మలు వేసేవారు. సమయం దొరికితే చాలు.. పెన్సిల్ స్కెచ్‌తో కూడా వైవిధ్యమైన చిత్రాలను గీసేవారు.
సినీ ప్రయాణం
హైదరాబాద్ వచ్చాక మారుతి జీవితం పూర్తిగా మారిపోయింది. బన్నీ వాసు ద్వారా తనకు ఇష్టమైన సినిమా రంగంలోకి ప్రవేశించారు. "ఆర్య" సినిమాకు తొలుత డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత "ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే" సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కొన్ని వాణిజ్య ప్రకటనలకు సైతం దర్శకత్వం వహించారు.
తమిళంలో సూపర్ హిట్ సాధించిన "కాదల్" చిత్రాన్ని "ప్రేమిస్తే" పేరుతో మారుతి (Maruthi) అనువదించారు. యానిమేషన్ నేర్చుకున్న దాసరి మారుతిని అప్పట్లో చిరంజీవి తన పార్టీ జెండా డిజైన్ చేయమని కోరారట. "ప్రజా రాజ్యం" పార్టీ కోసం మారుతి ప్రత్యేకంగా యానిమేషన్ వర్క్ చేశారు. 2008లో మారుతి స్పందనను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి కెమెరాతో హీరో రవితేజతో "దొంగల ముఠా" సినిమాను తక్కువ బడ్జెట్‌తో తీశారు. తక్కువ ఖర్చుతో కూడా సినిమాలు తీయవచ్చని రామ్ గోపాల్ వర్మ ద్వారా తెలుసుకున్న మారుతి "ఈ రోజుల్లో " సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా 2012లో ఎంట్రీ ఇచ్చారు.
తక్కువ బడ్జెట్ మారుతీ స్పెషాలిటీ
బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్తజంట, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు దాసరి మారుతి. అలాగే గ్రీన్ సిగ్నల్, లవ్ యు బంగారమ్ చిత్రాలకు మారుతి సహ నిర్మాతగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహించిన "పక్కా కమర్షియల్" సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినా.. మారుతి డైరెక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.
"ఈ రోజుల్లో" సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా మారుతి సైమా అవార్డును అందుకున్నారు. పక్కా కమర్షియల్, లెజెండ్, లవ్ యూ బంగారం సినిమాల్లో మారుతి ప్రత్యేక పాత్రల్లో కూడా నటించారు. మారుతి తదుపరి సినిమా హీరో ప్రభాస్ (Prabhas) తో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి
Read More: ప్రభాస్(Prabhas), మారుతీ కాంబోలో కామెడీ, హర్రర్ సినిమా... టైటిల్ ఫిక్స్ అయినట్టేనా!.
Follow Us