HBD Anil Ravipudi: "హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి" - బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ చేయడంలో అనిల్ బెస్ట్.. అంతేగా..

మాటల రచయితగా సినీ కెరీయర్ ప్రారంభించిన అనిల్.. దర్శకుడిగా సూపర్ డూపర్ హిట్లను సాధించారు అనిల్ రావిపూడి (Anil Ravipudi).

HBD Anil Ravipudi: టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కామెడీ నేపథ్యంలో అనిల్ తెరకెక్కించిన 'ఎఫ్2', 'ఎఫ్ 3' సినిమాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. అంతేకాదు ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు అనిల్. మాటల రచయితగా సినీ కెరీయర్ ప్రారంభించిన అనిల్.. దర్శకుడిగా సూపర్ డూపర్ హిట్లను సాధించారు. అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి…

అనిల్ రావిపూడి (Anil Ravipudi) 1982 నవంబర్ 23 తేదీన ప్రకాశం జిల్లా చిలుకూరువారి పాలెంలో జన్మించారు. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరవాయికి వచ్చేశారు. అనిల్ పదవ తరగతి వరకు తెలంగాణలోనే చదివారు.

తండ్రికి ఆర్టీసీలో ఉద్యోగం రావడంతో అనిల్ కుటుంబం తిరిగి ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయారు. అనిల్ ఇంటర్ వరకు అద్దంకిలో చదివారు. ఆ తరువాత వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 

అనిల్ రావిపూడికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. అనిల్ బాబాయి దర్శకుడు అరుణ్ ప్రసాద్. పవన్ కల్యాణ్‌తో అరుణ్ ప్రసాద్ 'తమ్ముడు' సినిమాను తెరకెక్కించారు. 

అరుణ్ ప్రసాధ్ దగ్గర సహాయ దర్శకుడిగా అనిల్ రావిపూడి పనిచేశారు. 2005లో విడుదలైన 'గౌతమ్ ఎస్.ఎస్.సి' సినిమాకు అనిల్ సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. 

'శౌర్యం', 'శంఖం', 'దరువు', 'సుడిగాడు', 'మసాలా' సినిమాలకు అనిల్ రావిపూడి మాటల రచయితగా పనిచేశారు. 

'కందిరీగ', 'ఆగడు' సినిమాలకు కథను అందించడంతో పాటు అనిల్ (Anil Ravipudi) మాటల రచయితగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

'పండగ చేస్కో' సినిమాకు కథా రచయితగా, 'గాలి సంపత్' చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా వ్యవహరించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన తొలి సినిమా 'పటాస్'. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. 'పటాస్' చిత్రంతో అనిల్ కొత్త దర్శకుడినిగా ఫిలిమ్ ఫేర్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను అందుకున్నారు. 

రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్‌తో 'సుప్రీమ్', ఆ తరువాత 2017లో రవితేజతో 'రాజా ది గ్రేట్' సినిమాలను డైరెక్ట్ చేసిన అనిల్ స్టార్ దర్శకుడిగా మారారు. 

అనిల్ రావిపూడికి బిగ్ బ్రేక్ ఇచ్చిన చిత్రం 'ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. ఈ సినిమా 2019లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు. 

'ఎఫ్2' సినిమా తరువాత అనిల్ దర్శకుడిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వురూ' సినిమాతో తన డైెరెక్షన్ సత్తా ఏంటో టాలీవుడ్‌కు చూపించారు అనిల్.

'ఎఫ్2' సినిమాకు సీక్వెల్ 'ఎఫ్3'తో అనిల్ రావిపూడి థియేటర్లలో నవ్వులు పూయించి... తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 'ఎఫ్ 2', 'ఎఫ్3' సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అనిల్ రావిపూడి నటించారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ 108వ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కామెడీతో పాటు మాస్ సినిమాలను డైరెక్షన్ చేయడంలో తన సత్తా చాటనున్నారు అనిల్ రావిపూడి.

ప్రముఖ ఓటీటీ సంస్త ఆహా.. 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' (Comedy Stock Exchange) పేరుతో ఓ కామెడీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ షోకి న్యాయనిర్ణేతగా అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అనిల్ రావిపూడి ప్రేక్షకులకు వినోదం అందించనున్నారు.

Read More: ఆహాలో సరికొత్త షో 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' (Comedy Stock Exchange).. జడ్జిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)!

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలతో ప్రేక్షకులకు మరింత వినోదం అందించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి.
పింక్ విల్లా
You May Also Like These