టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, ప్రస్తుతం ఓ బెంగాల్ నవల ఆధారంగా మరో చిత్రానికి స్క్రిప్ట్ అందిస్తున్నారు. 'వందేమాతరం' గేయం సృష్టికర్త, ప్రఖ్యాత రచయిత బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనంద్ మఠ్' (Anandamath) నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమాను నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్‌ఎస్ 1 ఎంటర్‌టైన్‌మెంట్, పీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించింది. ముందుగా చెప్పినట్లుగా టాలీవుడ్‌కి చెందిన యువ దర్శకుడు, రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ‘1770’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ.. కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
'1770' (1770 Movie) సినిమా అయితే ప్రకటించారు గానీ.. అందులో హీరో ఎవరు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలో హీరో పేరును వెల్లడించనున్నారని తెలుస్తోంది. కాగా, ఇంతకు ముందు '1770 ఏక్ సంగ్రామ్' పేరుతో హిందీలో ఓ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు దీనినే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.
నవరాత్రుల సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు నిర్మాతలు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం మొదలైన వివరాలను దీపావళి సందర్భంగా ప్రకటిస్తామని తెలిపారు.
చిత్ర దర్శకుడు అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు అప్ డేట్ ఇచ్చారు.
ఈ సినిమాని ఉద్దేశిస్తూ ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ (V. Vijayendra Prasad) మాట్లాడారు. ‘‘అన్యాయానికి వ్యతిరేకంగా జాతినంతటినీ ఏకం చేసి పోరాడేలా 'వందేమాతరం' గీతం చేసింది. 1779లో స్వాతంత్య్ర సమరం కోసం మొయన అనే ప్రాంతంలో స్ఫూర్తిని రగిల్చిన యోధులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరి గురించి తెలియజేసే చిత్రమే ఇది’’ అని తెలిపారు.
Follow Us