ఒక వైపు సినిమా .. మరో వైపు నాటకం : ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అజయ్ మంకెనపల్లి (Ajay Mankenapally)

క్రియేటివ్ థియేటర్ సంస్థను హైదరాబాద్‌లో నడుపుతున్న నటుడు అజయ్ మంకెనపల్లి (Ajay Mankenapally) భీమ్లా నాయక్, పుష్ప లాంటి చిత్రాలలో నటించారు.

మద, సైరా నరసింహారెడ్డి, భీమ్లా నాయక్, ఆకాశవాణి, అర్థ శతాబ్దం, పుష్ప, లాంటి సినిమాలతో జనాలకు సుపరిచితమైన నటుడు అజయ్ మంకెనపల్లి. అయితే ఒకవైపు సినిమాలలో నటిస్తూ కూడా.. నాటకాలపై ఎనలేని ప్రేమతో ఔత్సాహిక కళాకారులతో ఓ నాటక సంస్థనే స్థాపించిన ఘనత ఆయనది. అజయ్ గురించి మరిన్ని విశేషాలు పింక్ విల్లా పాఠకుల కోసం 

ఖమ్మం జిల్లాలోని కోరట్లగూడెం గ్రామం, నేలకొండపల్లి మండలంలో జన్మించిన అజయ్ "క్రియేటివ్ థియేటర్" పేరిట కొద్ది సంవత్సరాలుగా నాటకాలను హైదరాబాద్‌లో ప్రదర్శిస్తున్నారు. తన నాటకాలను తానే రచిస్తూ, వాటికి దర్శకత్వం వహించడం అజయ్ ప్రత్యేకత. ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆయన ఔత్సాహిక కళాకారుల కోసం వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. 

 

షేక్స్ పియర్ నాటకాన్ని తెలుగులో..

నాటకాలకు సంబంధించి ఇప్పటికి చాలా ప్రయోగాలు చేశారు అజయ్. ముఖ్యంగా విలియమ్ షేక్స్‌పియర్ రచించిన "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్"ను తెలుగులో నాటకీకరించి ప్రదర్శించడం సాహసమే అని చెప్పాలి. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను కూడా నాటకంగా మలిచి తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించారు. కొత్త నటులను ఎప్పటికప్పుడు నాటక రంగానికి పరిచయం చేయడం అజయ్ ప్రత్యేకత. 

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ రచించిన "అసమర్థుడు" నాటకానికి కూడా ఇటీవలే అజయ్ దర్శకత్వం వహించారు. ” అసమర్థుడు ” నాటకం ప్రధానంగా స్త్రీ శక్తికి ఒక వినూత్న అర్థాన్ని చెప్పేందుకు ప్రయత్నించిన నవీన ప్రయోగమే.  అలాగే మెర్సీ వ్రాసిన మరో నాటకం "త్రిపుర శపథం" కూడా అజయ్ దర్శకత్వంలోనే మెరుగులు దిద్దుకుంది. 

 

 

తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం

గాడ్ డెవిల్ మంకీ, నానా జాతి సమితి, ఆలోచన, మార్పు మొదలైన తెలుగు నాటకాలకు అజయ్ దర్శకత్వం వహించారు. అలాగే పల్నాటి యుద్ధం, బతుకమ్మ, జ్యోతిరావ్ ఫూలే, జయ జయహే తెలంగాణ, జంబూద్వీపం మొదలైన నాటకాలలో కూడా నటించారు. నాటక రంగానికి అజయ్ చేస్తున్న విశేష కృషిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం 2021 రంగస్థల యువ పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో కూడా అజయ్ ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. 

తొలుత గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా మలుచుకున్న అజయ్.. తర్వాత అనుకోని సందర్భంగా తన స్నేహితుడి ప్రోద్బలంతో నాటక రంగంపై ఆసక్తిని పెంచుకున్నారట. తర్వాత అదే రంగాన్ని తన కెరీర్‌గానూ మార్చుకున్నారు. నాటకాల మీద ఆసక్తితోనే తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల శాఖలో ఎంపిఏ పూర్తి చేసిన అజయ్ ప్రస్తుతం ఎంఫిల్ చేస్తున్నారు. 

 

క్రియేటివ్ థియేటర్ ఓ నాటక ప్రయోగశాల 

"ఎందుకో తెలియడం లేదు. చేతులకు కాగితాలు మొలుస్తున్నాయి. ఇక్కడ ప్రతి అక్షరం జ్ఞానపు గింజలై.. ఎప్పుడో మరణించిన చిత్రానికి ఇప్పుడు కొత్త రంగులు అద్దుతున్నాయి. ఆ నోటి నవ్వుకు పట్టుదల పెరుగుతుంది" అంటూ అప్పుడప్పుడు కవిత్వం చెప్పే అజయ్ నాటక రచనలో ఎప్పటికప్పుడు కొత్త మెళకువలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. నిత్య విద్యార్థిగానూ వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం అజయ్ ఆధ్వర్యంలోనే "క్రియేటివ్ థియేటర్" సంస్థ యాక్టింగ్ వర్క్ షాపు ఏడవ సీజన్‌ను ప్రారంభించింది.

నటనలో మెళకువలు నేర్చుకోవాలనుకొనే ఔత్సాహికులు, విద్యార్థులు క్రియేటివ్ థియేటర్ నిర్వాహకులను info.creativetheatre@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఒక 40 నుండి 45 రోజులు సమయం కేటాయించగలిగితే, ఎవరినైనా నటీనటులుగా తీర్చదిద్దగలమని ఎంతో విశ్వాసంతో చెబుతోంది అజయ్ నటనా దళం. 

Read More : దైవాగ్రహానికి గురయ్యే దారి తప్పిన మనుషుల కథ.. నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన రిషబ్ శెట్టి 

Credits: Instagram
You May Also Like These