నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన 100వ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు పన్ను రాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ మేరకు హీరో బాలకృష్ణ, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా నిర్మాతలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక, మరో సినిమా ‘రుద్రమదేవి’ సినిమాకు కూడా నోటీసులు వెళ్లాయి. ఈ రెండూ చారిత్రాత్మక సినిమాలు కావడంతో ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.
పన్ను రాయితీ సొమ్ము వసూలు చేయాలని..
పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు ట్రాన్స్‌ఫర్ చేయలేదని, రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది వినియోగదారుల సంఘం. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ధర్మాసనం వివరణ ఇవ్వాల్సిందిగా హీరో బాలకృష్ణకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
బాలకృష్ణ (BalaKrishna) 100వ చిత్రంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. 2017 జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. ఇక, అనుష్క కీలక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి గుణశేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. 2015 అక్టోబర్ 9న రుద్రమదేవి సినిమా రిలీజైంది.
Read More : 'ఎన్‌బీకే 107' (NBK 107) రిలీజ్ తేదీ ఫిక్స్ అయినట్టేనా!..మోత మోగనున్న బాలకృష్ణ (Balakrishna) డైలాగులు
Follow Us