మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కష్టపడి ఎదిగి ఇండస్ట్రీలో ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. అయినా గర్వం అనేది లేకుండా అందరితో కలిసిపోతుంటారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తుంటారు కూడా. టాలెంట్ ఉన్న వాళ్లకు తన సినిమాల్లో అవకాశం ఇస్తూనే.. ప్రతిభ ఉన్న వాళ్లను ప్రోత్సహించడం, వారిని ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటారు.
గోపీచంద్ హీరోగా నటించిన తాజా సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. జూలై 1వ తేదీన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అలనాటి విలక్షణ నటుడు రావు గోపాలరావు, ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో ఆయన టైమింగ్‌ను తాను ఇష్టపడేవాడినని, ప్రస్తుతం రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్ నటన తనకు ఎంతగానో నచ్చుతోందని చెప్పారు చిరు.
చిరంజీవి ఏమన్నారంటే..
‘రావుగోపాలరావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనను చిన్నమావయ్య అని పిలిచేవాడిని. మా మావయ్య అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు ఇద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం. ఆయనకు కూడ నేనంటే ఎంతో ప్రేమ. వాళ్లింటి నుంచి నా కోసం తరచూ భోజనం తీసుకుని వచ్చేవారు. వంకాయ కూరని శ్రీదేవి బుగ్గల్లా, చికెన్‌ని మరొక విధంగా అన్వయించేవారు.
వాటిని తినే వరకూ ఊరుకునేవారు కాదు. అత్తయ్య(రావు గోపాలరావు సతీమణి) నా కోసం ప్రత్యేకంగా తులసి చారు చేసి పంపేవారు. రావుగోపాలరావు గారి స్ఫూర్తితో రావు రమేశ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చకున్నారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఉత్తమమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు రమేశ్.
ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సినిమాల్లో కూడా రమేష్ నటించాలి’ అని చిరంజీవి (Chiranjeevi) చెప్పుకొచ్చారు. చిరంజీవి మాటలకు రావురమేష్ ఉద్వేగానికి లోనయ్యారు. చిరు కాళ్లకు నమస్కరించి.. ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read More : Chiranjeevi: చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. గోపీచంద్ తండ్రి నన్నెంతో సపోర్ట్ చేశారు , ఆయన నాకు సీనియర్ !
Follow Us