పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan).. అభిమానుల గుండె చప్పుడు.. ట్రెండ్ సెట్టర్.. ఒక సెన్సేషన్.. ఇవన్నీ ఆయన ఇమేజ్‌ను తెలియజేయడానికి వాడే కొన్ని పదాలు మాత్రమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం.. స్టార్ హీరో అయినా అందరిలో ఒకడిగా కలిసిపోయే నైజం.. పవన్ కల్యాణ్‌ను అభిమానులకు మరింతగా దగ్గర చేస్తోంది. అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
కల్యాణ్ బాబు నుంచి పవన్ కల్యాణ్‌గా..
పవన్ కల్యాణ్ 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో పుట్టారు. ఇంటర్‌తో చదువును ఆపేశారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. 'కల్యాణ్ బాబు' అనే పేరును 'పవన్ కల్యాణ్'గా మార్చుకున్నారు. 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా ఇమేజ్ దక్కించుకున్న పవన్.. 'తొలిప్రేమ' సినిమాతో స్టార్ హీరో అయ్యారు. తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో 'పవర్ స్టార్'గా ఎదిగారు.
ఫ్లాప్‌లు వచ్చినా..
గుడుంబా శంకర్, జానీ, బాలు, పంజా, తీన్మార్, బంగారం, అన్నవరం, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పవన్ కల్యాణ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ భారీ హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అనంతరం వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా వసూళ్లలో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను బద్దలు కొట్టింది. 'అజ్ఞాతవాసి' సినిమా అనుకున్న రేంజ్‌లో విజయం సాధించలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కల్యాణ్. మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో మరోసారి సత్తా చాటారు. అనంతరం వచ్చిన బీమ్లా నాయక్ సినిమా కూడా హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు అభిమానుల చూపులన్నీ హరిహర వీరమల్లు సినిమాపైనే ఉన్నాయి.
దర్శకుడు, నిర్మాత, స్టంట్ మాస్టర్..
హీరోగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా, స్టంట్ మాస్టర్‌గానూ వ్యవహరించారు పవన్. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సినిమాలు చేశారు. ముగ్గురు మొనగాళ్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడిగా జానీ సినిమాను తెరకెక్కించారు. తన సినిమాలు కొన్నింటికి స్టంట్స్ మాస్టర్‌గా కూడా పని చేశారు. జానీ, గుడుంబా శంకర్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం అందించారు పవన్.
జనం కోసం ఏదో చేయాలనే తపనతో..
పవన్ కల్యాణ్ ఒక విలక్షణమైన వ్యక్తి. స్టార్ హీరోగా ఎదిగినా ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగినా విజయం సాధించలేదు. అయితేనేం.. జనం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్తారు పవన్ కల్యాణ్.
అభిమానుల కోలాహలం..
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో కోలాహలం మొదలైంది. పెద్ద సంఖ్యలో పోస్టింగ్‌లు పెడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఊర్లల్లో పుట్టినరోజు సంబురాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్‌డే సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను థియేటర్లలో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Read More : రథంపై దూసుకెళుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్
Follow Us